ఒక కాకి చనిపోతే ఆ కాకి చుట్టూ చేరి మిగిలిన కాకులు కావ్..కావ్ అంటూ తమ సంఘీభావం తెలుపుతాయి. ఒక కోతి చనిపోతే చనిపోయిన కోతి కోసం మిగిలిన కోతులు అక్కడ విధ్వంసం సృష్టిస్తాయి. అదేమి ఖర్మో ఒక మనిషి యాక్సిడెంట్ అయి పడి వున్నా కనీసం అక్కడ ఆగే తీరిక కూడా ఉండదు మన జనాలకి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లో ఎక్కువ నమోదు అవుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితుల్ని చూసినా ప్రజలు పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న వీళ్లిద్దరినీ వాహనదారులు, పాదచారులు చూసుకుంటూ వెళ్లారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు.
తీవ్ర రక్తస్రావంతో వీళ్లిద్దరూ చనిపోయారు. వీళ్లిద్దరూ తల్లీ కూతుళ్లు కావడం బాధాకరం. అందుతున్న సమాచారం ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాలకు చెందిన అందెల మల్లమ్మ(75) రెండు రోజుల క్రితం భాగ్యలత కాలనీ సమీపంలోని అరుణోదయ కాలనీలో ఉండే తన కుమార్తె ఎర్రగొల్ల భారతమ్మ(45) ఇంటికి వచ్చింది. మల్లమ్మను తిరిగి స్వగ్రామంలో వదిలివేయడానికి కుమార్తె భారతమ్మ శనివారం ఉదయం బయల్దేరింది. భాగ్యలతకాలనీ బస్టాపు వద్ద వీరిద్దరూ జీబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్డు దాటుతుండగా హయత్నగర్ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఇద్దరూ మృతిచెందారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.