Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్కోసారి ఎగతాళికి చెప్పినా నిజం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోసారి ఎంత సీరియస్ గా మాట్లాడినా అది కామెడీ అయిపోతుంది. ఈ విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి బాగా వర్తిస్తుంది. పైకి మేధావిలా కనిపించే ఈయనకు రాజకీయ అంచనాలు వేయడంలో మాత్రం ఏ మాత్రం నైపుణ్యం లేదని చెప్పడానికి ఏపీ విభజన అంశమే పెద్ద సాక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదని టీవీ చర్చల్లో ఉండవల్లి చెప్పిన మాటలు నిజం అనుకుని మౌనంగా వుంది ఎంతగా దగా పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక విభజన తర్వాత పట్టిసీమ వల్ల గోదావరి జిల్లాలకు నష్టం అని, అదో దండగమారి ఖర్చు అని ఉండవల్లి ఎంత ప్రచారం చేశారో అంతా చూసారు. కానీ పట్టిసీమ వల్ల మూడేళ్ళుగా ఎంత ప్రయోజనం జరిగిందో డెల్టా రైతాంగాన్ని అడిగితే ఉండవల్లికి బాగా సమాధానం చెబుతారు.
ఇక తాజాగా ఉండవల్లి చేసిన మరో కామెంట్… ఏపీ సమస్యల విషయంలో టీడీపీ మడమ తిప్పని పోరాటం చేస్తే, మోడీ కక్షగట్టి చంద్రబాబుని జైల్లో వేస్తే సానుభూతితో టీడీపీ కి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని ఉండవల్లి ఉవాచ. అందులో నిజం లేకపోలేదు. చంద్రబాబుని ఎలాగైనా జైలుకు పంపాలన్న ఉండవల్లి దుర్బుద్ధి ఇందులో కనిపించినా నిజంగా అదే జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నిజంగానే 175 సీట్లు కాకపోయినా 150 చోట్ల గెలుస్తుంది. ఈ విషయం తెలుసు గనుకే తల ఎగరేసిన వాళ్ళందరి భరతం పట్టిన మోడీ కూడా ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు. ఏదేమైనా టీడీపీ కి క్లీన్ స్వీప్ చేసే సలహా ఇచ్చిన ఉండవల్లికి థాంక్స్ చెప్పాల్సిందే.