ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని తెలంగాణ ఉద్య‌మంతో పోల్చ‌లేం

Undavalli says don't Compare AP Special Status fight with Telangana Fight

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరాటంపై సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ విష‌యానికి కొంత‌మంది అనుకూలం, కొంత‌మంది వ్య‌తిరేకంగా ఉన్న‌ప్పుడు దాన్ని నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఉద్య‌మం చేస్తార‌ని, తెలంగాణ‌, స‌మైక్యాంధ్ర పోరాటాలు ఇదే తీరులో జ‌రిగాయ‌ని, అటువంటి వాటిని ఉద్య‌మాలు అంటార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఆ ఉద్య‌మాల‌తో ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని పోల్చ‌లేమ‌న్నారు. ప్ర‌త్యేక హోదాకు బీజేపీ త‌ప్ప అన్ని పార్టీలూ అనుకూలమేన‌ని, మ‌రి ఈ పోరాటాన్ని ఉద్య‌మం అని ఎలా పిలుస్తార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ్యానికి తూట్లు పొడిచేలా మ‌న వ్య‌వ‌స్థ న‌డుస్తోంద‌ని, మ‌న‌ది ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ అని కొంద‌రంటున్నార‌ని, నిజానికి మ‌న‌ది ఫెడ‌రల్ వ్య‌వ‌స్థ కాద‌ని, యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్ అని, మ‌న వ్య‌వ‌స్థ మొత్తం కేంద్ర‌ప్ర‌భుత్వం చేతుల్లో ఉంద‌ని తెలిపారు.

టీడీపీ ప్ర‌భుత్వంపైనా ఉండ‌వ‌ల్లి విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీయే కార‌ణ‌మ‌ని గ‌తంలో ఏ పార్టీ అయినా చెప్ప‌డం మ‌నం ఎప్పుడూ విన‌లేద‌ని మండిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు వైసీపీనే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు అంటున్నార‌ని, నాలుగేళ్ల‌గా పోరాడ‌లేని వారు ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌త్యేక హోదా ఎలా సాధిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి రెండు ప్ర‌ధాన పార్టీలు రెడీ అవుతున్నాయ‌ని, ప్ర‌తి ఓట‌ర్ కి రూ. 2వేలు ఇవ్వ‌గ‌లిగేవారికి టికెట్లు ద‌క్కుతాయ‌ని విశ్లేషించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాగుప‌డాలంటే… డ‌బ్బు ఖ‌ర్చు పెట్టిన అభ్య‌ర్థిని ప్ర‌జ‌లు ఓడించాల‌ని, ఎవ‌రి ద‌గ్గ‌ర డబ్బులు తీసుకుంటారో వారికి ఓట్లు వేయ‌కూడ‌ద‌ని ఉండ‌వ‌ల్లి కోరారు.