Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం చెలరేగిన గాలిదుమారం మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే…మళ్లీ గాలివానలు ముంచుకొస్తున్నాయి. దేశానికి అకాల వర్షాల ప్రమాదం ఇంకా పొంచేఉందని, దేశవ్యాప్తంగా తొమ్మిదిరాష్ట్రాల్లో వచ్చే 48 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ముంచెత్తే అవకాశముందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, తెలంగాణకు గాలివానల ముప్పు పొంచిఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో వడగళ్లవానలు కురవచ్చని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. బుధవారం కురిసిన గాలివాన ఉత్తరాది రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లో 109 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్ ను ఇసుక తుఫాన్ ముంచెత్తింది. ఇసుక తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇసుక తుఫాన్ మృతులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలునష్టపరిహారం ప్రధాని ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి మృతులకు రూ. నాలుగులక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2లక్షలు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఇసుకతుపాన్ కారణంగా చారిత్రక కట్టడాలు తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీలకు కూడా నష్టం వాటిల్లింది.