Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకచోట స్విచ్ నొక్కితే ఇంకో చోట బల్బ్ వెలుగుతుంది అన్న ఓ సినిమా డైలాగు కురుక్షేత్ర మహాసభ విషయంలో నిజం అవుతోంది. అదెలాగంటే …రాజధాని అమరావతి సమీపంలో ఎలాగైనా కురుక్షేత్ర సభ నిర్వహించి తీరతామని ప్రకటించిన mrps నాయకుడు మందకృష్ణ ని ఏపీ సర్కార్ విజయవంతంగా నిలవరించింది. అయితే ఆ వైఫల్యాన్ని తీవ్రంగా తీసుకున్న మందకృష్ణ ఈరోజు వరంగల్ లో అనూహ్య ఆరోపణలు చేశారు.
దేశంలో పది రాష్ట్రాల్లో mrps పని చేస్తోందని అయినా ఎక్కడా ఎదురుకాని పరిస్థితులు తనకు ఆంధ్రప్రదేశ్ లో ఎదురైనట్టు మందకృష్ణ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తమ స్వేచ్ఛని హరించారని కృష్ణ ఆరోపించారు.తన స్వేచ్ఛ పోవడంతో పాటు ప్రాణభయం కూడా ఏర్పడిందని మందకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. తనని గుర్తు తెలియని కార్లు వెంబడిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ఈ విషయం తెలంగాణ సీఎం కెసిఆర్ తేల్చాలని కృష్ణ డిమాండ్ చేశారు. 24 గంటల్లో తన వెనుక పడిన వారిని గుర్తించి శిక్షించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే ఇది జరిగి ఉంటుందని కృష్ణ సందేహం వ్యక్తం చేశారు. వర్గీకరణ చేస్తామన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట తప్పారని మందకృష్ణ ధ్వజమెత్తారు. తన రక్షణ ఏర్పాట్ల కోసం కోర్టుని ఆశ్రయించబోతున్నట్టు మందకృష్ణ వివరించారు.
కొన్నాళ్లుగా మౌనంగా వున్న మందకృష్ణ ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. అయితే రాజకీయ కోణంలో చూస్తే మందకృష్ణ తాజా టార్గెట్ చంద్రబాబు అయినా దెబ్బ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి తగిలేలా వుంది. మందకృష్ణ స్వరం పెరిగేకొందీ ఆంధ్రాలో టీడీపీ కి మాదిగలు దూరం కావొచ్చన్న భయం ఉన్నప్పటికీ అక్కడ ఎస్సీల్లో మాలలదే పెద్ద నెంబర్. అందుకే మందకృష్ణ ఎంత మాట్లాడుతున్నా వైసీపీ అధినేత జగన్ కూడా ఈ విషయం మీద నోరు మెదపలేదు. ఓ విధంగా చెప్పాలంటే కృష్ణ పోరాటంతో ఓ వర్గం టీడీపీ కి దూరమైనా అదే సమయంలో ఇంకో మెజారిటీ వర్గం చేరువ అవుతుంది. అటు తెలంగాణ విషయానికి వచ్చేసరికి భిన్నమైన పరిస్థితి. ఇక్కడ మాలలతో పోల్చుకుంటే మాదిగల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే మందకృష్ణ స్వరం పెరిగేకొద్దీ తెలంగాణ లో అధికార పార్టీకి ఇబ్బందే.
మరిన్ని వార్తలు: