Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార బీజేపీ దూకుడు పెంచింది. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కు పట్టున్న బరూచ్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. అహ్మద్ పటేల్ ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంటే ఆ పార్టీ నేతలు రాజ్యసభ సీటును దక్కించుకోవడం కోసం బెంగళూరులో తలదాచుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ లో చెప్పుకోదగ్గ ఆ నేత బరూచ్ కు ఏం చేశారని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. యూపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆయన ప్రస్తావించారు. దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి యూపీ ప్రజలకు బాగా తెలుసని, గుజరాత్ లోనూ కాంగ్రెస్ కు యూపీ ఫలితమే పునరావృతమవుతుందని మోడీ వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఆ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ప్రజలను విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.