Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలు దేశాల ప్రభుత్వ వ్యవస్థల కార్యకలాపాలు స్తంభించాయి. వాన్నా క్రై సైబర్ దాడే దీనికి కారణం. దాదాపు 150 దేశాల్లోని 3లక్షల కంప్యూటర్లు ఈ దాడికి గురయ్యాయి. టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగముందో… అదే సమయంలో ఎంత ప్రమాదమూ పొంచి ఉందో ఈ ఘటనతో ఒక్కసారిగా అందరికీ తెలిసొచ్చింది. ప్రపంచం మొత్తాన్ని వణికించిన వాన్నా క్రై వెనక ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించి బలమైన సాక్ష్యాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ట్రంప్ భద్రతాసలహాదారు టామ్ బాసొర్టే పేరుతో వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరిగిందని బాసొర్టే తెలిపారు.
దాడికి వెనక ఉన్న సూత్రధారులను తాము దర్యాప్తులో గుర్తించామని బాసొర్టే వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా ఉత్తరకొరియా చర్యలు ఏ మాత్రం బాగోలేవని, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తోటి దేశాలను ఇబ్బంది పెడుతోందని, ఇందులో భాగంగానే వాన్నా క్రై ద్వారా దాడికి తెగబడిందని ఆరోపించారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అణు, క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోందన్నారు. తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశం మరింత ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.