Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నియోజకవర్గాల పునర్విభజన కోసం తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాలైన టీడీపీ, తెరాస చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. అయితే రెండు పార్టీలకు కూడా ప్రధాని మోడీ ఈ విషయంలో తమకు అనుకూలమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేదు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సూపర్ ఫాస్ట్ గా ఆపరేషన్ ఆకర్ష్ నడిపించిన టీడీపీ, తెరాస ఆపై స్పీడ్ తగ్గించాయి. కారణం అందరికీ తెలిసిందే. ఇబ్బడిముబ్బడిగా పక్క పార్టీల నుంచి నాయకులను తీసుకుంటే టిక్కెట్ల కేటాయింపులో సమస్యలు, అంతర్గత గొడవలకు దారి తీస్తోందని కూడా రెండు పక్షాలకు అర్ధం అయ్యింది. దీంతో కొన్నాళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ కి బ్రేక్ వేసాయి రెండు పార్టీలు. ఇక బీజేపీ నియోజకవర్గాల పునర్విభజనకు ఓకే అంటుందా లేదా అన్న ఆలోచనలో నిరీక్షణకు పరిమితం అయ్యారు చంద్రబాబు, కెసిఆర్.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ప్రధాని మోడీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, తెరాస కి మేలు చేసే నిర్ణయం తీసుకోరని అంతా అనుకున్నారు. కానీ మోడీ ఈ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. మోడీ నిర్ణయాన్ని బీజేపీ నేతలు కాకుండా కాంగ్రెస్ బయటపెట్టడం ఆశ్చర్యమే. కానీ ఇదే జరిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈ విషయం చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన మీద మోడీ సానుకూల నిర్ణయం తీసుకున్నారని ఆ ఫైల్ మీద సంతకం పెట్టినట్టు స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలిపారు. ఝార్ఖండ్ లో సీట్ల పెంపు గురించి బీజేపీ పట్టుపట్టడం తో మోడీ దాంతో పాటు తెలుగు రాష్ట్రాల గురించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం లో ఆశ్చర్యం లేకపోయినా కాంగ్రెస్ ద్వారా బయటకు రావడం ఆశ్చర్యమే.