Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస సీనియర్ నేత వీహెచ్ తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ భజన చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉందని, ఇకపై అవినీతి కేసులో గవర్నర్ నూ విచారించాల్సి వస్తుందని, నరసింహన్ ను తాము విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. రైతులకు సంకెళ్లు వేస్తే మాట్లాడని గవర్నర్..టీఆర్ఎస్ భజన చేస్తున్నారని మండిపడ్డారు. అటు గవర్నర్ తీరు పై ఏపీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలైతే ఒకడుగు ముందుకు వేసి ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ ఇన్నేళ్లు కొనసాగుతారని ఎవరూ ఊహించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్…విభజన వంటి క్లిష్టసమయాల్లోనూ, ఆ తర్వాతా తన మార్క్ ప్రదర్శించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగిస్తున్న బీజేపీ ప్రభుత్వం నరసింహన్ విషయం వచ్చేసరికి మాత్రం ఆయన్నే కొనసాగించింది. అయితే ఇటీవలి కాలంలో ఆయనపై రెండు రాష్ట్రాల్లోనూ విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ గవర్నర్ గా ఆయన్ను ఎక్కువ రోజులు కొనసాగించరన్న ప్రచారం జరుగుతోంది.