ఎన్నికల ముంగిట ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ కృష్ణ జిల్లా కీలక నేత వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వంగవీటి రాధా పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ లేఖలో వంగవీటి రాధా, తనది ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదని, ప్రజా సంక్షేమం న్యాయ సంరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని, దమనకాండకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వంగవీటి రాధా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో జగన్ మీద కూడా వంగవీటి రాధా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే మీ కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు పార్టీలోని అందరి మీద ఆంక్షలు విధిస్తున్నారు. అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాల్సి ఉంది అంటూ వంగవీటి రాధా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయవాడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయ్యాక వైసీపీలో చేరారు గత ఎన్నికల్లో ఆయనకు విజయవాడ తూర్పు టిక్కెట్ కేటాయించారు.
కానీ అక్కడా విజయం సాధించలేకపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పని చేసుకోవాలని జగన్ సూచించడంతో అక్కడ రాజకీయాలు చేశారు. చివరి క్షణంలో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకొచ్చి ఇంచార్జ్ ని చేయడమే కాక టిక్కెట్ కూడా ఆయనకేనని జగన్ ప్రకటించడంతో వంగవీటి రాధా మనస్థాపానికి గురయ్యారు. అప్పటి నుండే ఆయన పార్టీ వీదతారని ప్రచారం జరిగింది. వాస్తవానికి నిజానికి వంగవీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అవమానకరంగా వ్యవహరించారు. మొదట్లో జగన్ బంధువు, వైసీపీ నేత గౌతం రెడ్డి వంగవీటి రంగాను పాముతో పోల్చారు. ఆ సమయంలో అది పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేసిన జగన్ ఆ తర్వాత దాన్ని ఎత్తేశారు. అప్పటి నుండి రాధాకృష్ణకు పార్టీలో ప్రాధాన్యం దక్కలేదు. డివిజన్ల అధ్యక్షులుగా ఉన్న రాధాకృష్ణ వర్గీయులను ఒక్కొక్కరిని తొలగించారు. చివరికి వంగవీటి టిక్కెట్‌కే ఎసరు పెట్టారు. టిక్కెట్ లేదని జగన్ ఒక్క సారి కూడా వంగవీటితో మాట్లాడలేదు. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి నేతల్ని పంపించి రక రకాల ప్రతిపాదనల్ని ఆయన ముందు పెట్టారు కానీ ఒక్క సారి కూడా జగన్ హామీ ఇవ్వలేదు. విజయవాడ తూర్పు, మచిలీపట్నం పార్లమెంట‌్ అని ఆశ పెట్టారు కానీ ఆయన దేనీకీ లొంగలేదు చివరికి ఆ రెండు స్థానాలను యలమంచిలి రవి, వల్లభనేని బాలశౌరిలకు కేటాయించారు. వారు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో వంగవీటి పార్టీకి రాజీనామా చేశారు.
అయితే.. ఆయన భవిష్యత్‌పై ఇప్పటికీ.. ఎలాంటి క్లారిటీ లేదు. జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ క్లారిటీ లేదు. పీఆర్పీ తరపున పోటీ చేసిన సమయంలో పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారని మాటిచ్చి రాకపోవడం వల్లే తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని ఆయనకు పవన్ అంటే ఒకింత బేధాభిప్రాయం ఉంది. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి జనసేనలో చేరినా ఆశ్చర్యం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన తన తండ్రిని చంపించింది అని భావించే తెలుగుదేశం వంక చూస్తున్నారని నిన్నటి నుండి ప్రచారం జరుగుతోంది. అలా గనుక జరిగితే వంగవీటికి విజయవాడలో సీటు సర్దుబాటు చేయడానికి చాన్స్ లేదు. అన్ని టీడీపీ సిట్టింగ్ స్థానాలే అందరికీ క్యాడర్ బలంగా ఉండడంతో వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఒక వేళ ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపితే మాత్రం ఏదో ఓ స్థానం కచ్చితంగా సర్దుబాటు చేయడానికి టీడీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుంది. మరి రాధా ఆ గట్టునుంటాడో ఈ గట్టుకి వస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.