వైసిపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరుతున్నట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వైసీపీలో చేరానని, కానీ అది అక్కడ సాధ్యం కాకపోవడంతో బయటకు వచ్చేశానని రాధా తెలిపారు. రంగా ఆశయం నెరవేరుస్తానని పార్టీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారని సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని రాధా చెప్పారు. తమ్ముడినే ఇలా చూస్తే సామాన్య ప్రజలను జగన్ ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక్క సీటు కోసం నాకు ఈ గొడవ అవసరం లేదు. నేను అభిమానం కోరుకున్నా మీరు జాలి చూపిస్తున్నారు. సీటు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, సూటిపోటి మాటలు నన్ను బాధించాయని రాధా అన్నారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరొకరికి ఎదురుకాకూడదని తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే ఎవరిని అడిగి వెళ్లావంటూ వైసీపీ నేతలు తనను మందలించారన్నారు. ఇదెక్కడి న్యాయమని రంగా విగ్రహావిష్కరణకు అన్ని రకాల పార్టీల వాళ్లు వస్తారని ఆయన అభిమానానికి హద్దులు లేవన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీని వీడిన తర్వాత సోషల్ మీడియాలో తనపై బెదిరింపులు పెరిగాయని వంగవీటి రాధా అన్నారు.
ఒకవేళ తన చావు వారికి ఆనందం కలిగిస్తుందంటే చంపేయండని అన్నారు. తనకు ప్రాణం మీద ఆశ లేదని.. పేదల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన తండ్రి అని.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పారు. ‘నన్ను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలను. కానీ.. వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయాను. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది’ అని రాధా అన్నారు. అలాగే పార్టీ మారేందుకు వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వంగవీటి రంగా హత్యను ఓ పార్టీకి ఆపాదించడం సరికాదని ఆయన పెర్కొనడం ఆయన టీడీపీ చేరికని బలపరుస్తోంది. పేదల అభ్యున్నతి కోసం కష్టపడిన రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారంటున్నారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని దానిని ఏదో ఒక పార్టీకి పూయడం మంచిది కాదన్నారు. అయితే గతంలో టీడీపీ తన తండ్రిని చంపిందన్న వ్యాఖ్యల మీద ఆయన మాట్లాడుతూ ఆవేశంలో అందర్ని రెచ్చగొట్టి మాట్లాడానని అది నా పొరపాటని తర్వాత గ్రహించానని రంగాగారికి అన్ని పార్టీల్లో, కులాలు, మతాలకు అతీతంగా అభిమానులున్నారని రంగాగారి విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల నుంచి నేతలు వచ్చారని, తమకు రంగాగారి హత్యను ఆపాదించారని ఓ పార్టీ నేత అడిగే వరకు గ్రహించలేకపోయానని ఇలా పార్టీ లకి ఆపాదించి వారిని కించపరిచామని ఇప్పుడు తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు ఆ ప్రకటన ఆవేశంలో చేసిందని వాస్తవాన్ని మర్చిపోయామని చెప్పుకొచ్చారు.