బెజవాడ రాజకీయాలు రగులుతున్నాయి. నిన్నటి నుంచి గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైసీపీ అధిష్టానం ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. దీంతో మరోసారి రగడ ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో గడపగడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభమైంది. సెంట్రల్ కార్యక్రమానికి మల్లాది విష్ణు, వంగవీటి రాధాకృష్ణలు దూరంగా ఉన్నారు. దూరం జరగడానికి ఇరువురు నేతలు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. వంగవీటి రాధాని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్పడంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో వంగవీటి రాధాకృష్ణను బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
మరో పక్క వైసీపీకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా మల్లాది విష్ణుకు కేటాయించారంటూ ప్రచారం జరగడంతో వైఎస్ జగన్ పై రాధా అనుచరులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. సారా కాంట్రాక్టర్లు, అవినీతి పరులకు వైసీపీలో సీట్లు కేటాయిస్తారా అని రంగా, రాధా మిత్రమండలి ప్రశ్నిస్తోంది. వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు నిరసనకు దిగారు. రంగా ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో వేచి చూడక తప్పదు.