మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభంలో కాస్త మెల్లగా చిత్రాలను చేశాడు. కాని ఇప్పుడు స్పీడ్ పెంచడంతో పాటు, సక్సెస్ రేటును పెంచుకుంటూ, నటుడిగా విజయాలను దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే ‘తొలిప్రేమ’ చిత్రంతో కెరీర్‌లో మంచి సక్సెస్‌ను దక్కించుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఆ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ విభిన్న కథాంశ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు చివరి వరకు సినిమాను పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఇటీవలే తమిళనాడులోని రామేశ్వరం ఇంకా ప్రముఖ నగరాల్లో చిత్రీకరణ జరిపారు. అబ్దుల్ కలాం మెమోరియల్ స్కూల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరిపారు. అంతరిక్షంకు సంబంధించిన సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను ఆగస్టులో పూర్తి చేస్తాం అని, అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దసరాకు ఇప్పటికే మూడు నాలుగు సినిమాల క్యూ ఉంది. అందుకే దసరాను వదిలి పెట్టి దీపావళికి ఈ చిత్రం వస్తుందేమో అంటూ సనీ వర్గాల వారు చెబుతున్నారు. సంకల్ప్ రెడ్డి గత చిత్రం ఘాజీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే వరుణ్‌కు కూడా అంతరిక్షం మంచి సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే టాక్ విపిస్తుంది. ఈ సంవత్సరంలో వరుణ్ రెండు చిత్రాలు వస్తాయన్నమాట. వచ్చే ఏడాదికి కూడా రెండు ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఎఫ్2’ రానుండగా, మరో సినిమాతో కూడా వచ్చే అవకాశాలున్నాయి.