కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టోన్ లో ఈ మధ్య వచ్చిన మార్పు ఇంకా చాలా మందికి జీర్ణం కావడం లేదు. చంద్రబాబుని చెడామడా తిట్టిపోసిన ఆయన ఈమధ్యన కాపు రేజర్వేషన్ల అమలు సాధ్యం కాదన్న వైసీపీ అధినేత జగన్ మాటలతో బాగా హర్ట్ అయ్యారు. జగన్ మీద తీవ్ర విమర్శలతో పాటు ఆయన కన్నా చంద్రబాబు నయం అనే రీతిలో మాట్లాడారు. దీంతో ఆయన రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలుకుతారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయితే చిత్రంగా ఈ మాటల్ని ఇటు టీడీపీ శ్రేణులు గానీ, అటు ముద్రగడ అనుచరులు కానీ నమ్మలేదు సరికదా అది జరిగే పనికాదని అనుకున్నారు. దీంతో ముద్రగడ అడుగులు ఎటు పడతాయా అన్న ఆసక్తి అంతటా పెరిగింది. ఈ టైం లో ఆయనతో నేడు ఇద్దరు నాయకులు భేటీ కావడం ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది.
ముద్రగడని కలిసినవారిలో రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ , మాజీ ఎంపీ గిరజాల స్వామి నాయుడు వున్నారు. ఈ ఇద్దరు నాయకులు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి వచ్చి మరీ ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మొన్నామధ్య జనసేన అధినేత పవన్ తో సమావేశం అయిన వట్టి ఇప్పుడు ముద్రగడని కలవడం గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పవన్ తో ముద్రగడ సయోధ్య కోసం ప్రయత్నం చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం ప్రత్యేక హోదా తో పాటు కాపు రిజర్వేషన్ అంశం మీద హామీ ఇస్తున్న కాంగ్రెస్ ని బలపర్చమని ముద్రగడని ఆ ఇద్దరు కోరినట్టు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ఆ భేటీలో పాల్గొన్న వాళ్ళే చెప్పాలి. అసలు ఎవరు ఎన్ని చెప్పినా ముద్రగడ మాత్రం తన మనసులో ఏముందో అదే చేస్తారని పేరు. ఇంతకీ ఈ భేటీ ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ మాటలు , చేతల్లో అర్ధం అవుతుంది.