-
సరైన సాక్ష్యాలు కోసమే గజల్ శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉన్నా…
-
వీడియో దృశ్యాలపై బాధితురాలి వివరణ
గజల్ శ్రీనివాస్ పై ఫిర్యాదుచేసిన బాధితురాలు వీడియోలో ఆయనతో సన్నిహితంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. సరైన సాక్ష్యాల కోసమే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చింది. కావాలనే తాను ఆ రోజు బెడ్ రూమ్ లోకి వెళ్లి గజల్ శ్రీనివాస్ కు మసాజ్ చేశానని, ఆయన కాళ్లు పడుతున్నట్టు కూర్చున్నానని, ఇదంతా కెమెరాలో రికార్డవుతుందని తనకు తెలుసని, అవే ఇప్పడు కీలక సాక్ష్యాలయ్యాయని తెలిపింది. గజల్ శ్రీనివాస్ బెడ్ రూమ్ లో కెమెరాలు అమర్చానని తెలిస్తే… తనను చంపేస్తారని తెలుసని, కానీ తనలా ఇంకో అమ్మాయి కాకూడదనే ఆ పని చేశానని తెలిపింది. తాను ఎంతో ధైర్యంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను బయటపెడితే… కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఆయన్ను ట్రాప్ చేశానని అంటున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశానని, ఆయన బెడ్ రూంలో మంచం తప్ప మరేమీ ఉండదని, అయినా చాలా ధైర్యంగా సీక్రెట్ కెమెరాను పెట్టానని ఆమె చెప్పింది. కెమెరా ఫిక్స్ చేయడానికి వారం రోజులు పట్టిందని, ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాతే వీడియో రికార్డయిందని తెలిపింది.
కెమెరా ఎక్కడ ఉంచిన విషయం తన దగ్గరి స్నేహితురాలికి చెప్పానని, ఒకవేళ తాను ఏ రోజైనా ఆఫీసు నుంచి రాకపోతే… ఆ రోజు తన ఆఫీసుకు వెళ్లి, ఆ కెమెరాను తీసుకోవాలని ఆమెను కోరినట్టు వెల్లడిచింది. తొలుత పోలీసుల వద్దకు వెళ్లడానికి కూడా తాను భయపడ్డానని, అయితే ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రవీందర్ తనకు ధైర్యం చెప్పి, ఆయన్ను అరెస్టు చేశారని తెలిపింది. డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ విషయం ఎవరికీ చెప్పలేదని, తాను డబ్బుకోసం ఫిర్యాదుచేశాననడం సరైనది కాదని, డబ్బు ఆశించేదాన్నైతే పార్వతిలా తానూ తప్పు చేసేదాన్నని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు వెనక ఏ వర్గమూ లేదని, దాదాపు 15 వీడియోలను పోలీసులకు ఇచ్చానని తెలిపింది. తాను ఇన్ని ఆధారాలు, వీడియోలతో ఫిర్యాదుచేసినా..ఇంకా కొంతమంది తననే అనుమానంగా చూస్తున్నారని, ఇదే పరిస్థితి తమ ఇంట్లో ఆడపిల్లలకు ఎదురైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని కోరింది. వీడియోల్లో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని తెలిపింది. అటు రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్ కు అధికారులు యూటీ 1327 నంబరును కేటాయించారు. నిన్న ఉదయం వరకూ అడ్మిషన్ బ్లాకులోనే ఉంచిన అధికారులు అనంతరం రిమాండ్ బ్యారక్ కు తరలించారు. తొలిరోజు జైలులో ఆయన భోజనం చేయలేదని, బిస్కెట్లు, బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇతర ఖైదీలతో ఆయన మాట్లాడలేదని, కొందరు మాట్లాడించపోయినా ముభావంగా ఉండిపోయాడని చెప్పారు.