2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఆ దారి అనుకున్నంత సులువు కాదని ఇప్పటికే ఆయనకు అర్ధం అయ్యింది. అందుకే ఎప్పటికప్పుడు ఉత్సాహం తెచ్చుకుంటూ సరికొత్త వ్యూహాలతో ముందుకు నడుస్తున్నారు. కానీ జనసేన విస్తరణకు ప్రధాన అడ్డంకిగా నాయకుల లేమి మారింది. యువత మరీ ముఖ్యంగా పవన్ అభిమానులు జనసేనలో తమ వంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి అనుభవం ఎన్నికల రేసులో నిలబడేందుకు, పార్టీ వాణి బలంగా వినిపించేందుకు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మిగిలిన పార్టీల నుంచి కొందరు నాయకులు జనసేనలో చేరుతున్నప్పటికీ వారిలో ఫామ్ లో వున్న ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా పట్టుమని ఐదు నెలల గడువు మాత్రమే ఉండడంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలి అన్న విషయంలో జనసేన హై కమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ సమస్య తీరడం మాట అటుంచి ఈ కీలక సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజయబాబు రాజీనామా ఎన్నో చర్చలకు దారి తీసింది. విజయబాబు రాజీనామాతో జనసేన షాక్ తింది ఎంత నిజమో కాస్త తేరుకుని సంతోషపడ్డది కూడా అంతే నిజం.
విజయబాబు రాజీనామా తర్వాత జనసేన హ్యాపీ అంటే ఆశ్చర్యపడతారు. కానీ ఇది నిజం. ఆయన తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు చూపించి , పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకుండా వెళ్లడమే పెద్ద మేలుగా పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. జనసేనతోనే రాజకీయంగా తొలి అడుగులు వేసినప్పటికీ విజయబాబుకి ఆ రంగంలో అపార పరిజ్ఞానం వుంది. ఓ జర్నలిస్ట్ గా దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల మీద పట్టుంది. ఇక ఆర్టీఐ కమీషనర్ గా పనిచేసిన అనుభవం వుంది. అంతే కాకుండా టీవీ చర్చల్లో సాధికారికంగా రాజకీయ విశ్లేషణ చేయగలిగిన అనుభవం వుంది. ఇన్నిరకాలుగా అనుభవం వున్న వ్యక్తి జనసేన పిలుపు అందుకుని ఆ పార్టీలో చేరడమే అప్పట్లో ఆశ్చర్యంగా అనిపించింది. కానీ జనసేన అధికార ప్రతినిధిగా ఆయన తన బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వర్తించారు. కానీ హఠాత్తుగా పార్టీ తరపున కవాతు లాంటి ముఖ్య కార్య్రక్రమం జరుగుతున్నప్పుడే రాజీనామా ప్రకటించారు. నిజానికి ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అయితే ఈ విషయాల్ని పార్టీ వేదిక మీద ప్రస్తావించి సర్దుబాటు చేసుకుందామని ఆయన భావించారు. కానీ అది అనుకున్నంత చిన్న విషయం కాదని విజయబాబుకు అర్ధం అయ్యిందట. అందుకే మౌనంగా ఉపసంహారం చేసుకోవడం మంచిదని భావించి ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ ఏ విమర్శలు , బహిరంగ ఆరోపణలు చేయకుండా ఆయన పార్టీని వీడడం జనసేన కి కూడా హ్యాపీ.ఎందుకంటే 2009 లో దాదాపు ఇలా టి పాత్ర పోషించిన పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యానికి రాజీనామా చేస్తూ పార్టీ ఆఫీస్ లోనే చేసిన ప్రకటన ఎంత నష్టం చేసిందో తెలియంది కాదు. అందుకే విజయబాబు మౌన నిష్క్రమణ తో జనసేన హ్యాపీ అని చెప్పక తప్పదు.