‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీ టైటిల్ రోల్ పోషించి మెడికోగా అద్భుత నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది. తమిళంలోనూ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఒక్క సినిమాతోనే విజయ్ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రకు తెలుగు మూవీ ఫ్యాన్స్ ఫిదా కాగా…తాజాగా ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలను పక్కకు నెట్టి మరీ విజయ్ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్‌ను దక్కించుకున్నాడు. అతడికి ఇదే తొలి ఫిల్మ్‌ఫేర్ కావడం విశేషం. అయితే తన పుట్టినరోజున నగరం మొత్తం మీద ఐస్ త్రుక్స్ పెట్టించి వార్తలలో నిలిచిన ఆయన తాజాగా తన తొలి అవార్డును వేలంలో అమ్మదలచుకున్నానని ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని అన్నారు.
ఎవరైనా సాయం కోరితే మంత్రి కేటీఆర్.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుండడాన్ని తాను రోజూ ట్విట్టర్ లో చూస్తున్నానని, అందుకే వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ ఫండ్ కు ఇస్తానని చెప్పారు. ఆ అవార్డు తన ఇంట్లో ఉండడం కంటే తాను పుట్టిన నగరానికి ఉపయోగపడితే బాగుంటుందని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలిపారు. ‘‘సీఎం రిలీఫ్ ఫండ్‌కి నువ్వు సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉంది. నీ చొరవను అభినందిస్తున్నా. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదాం’’ అని కేటీఆర్ బదులిచ్చారు. కేటీఆర్ ట్వీట్‌కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. అలాగే అన్నా, ఫిల్మ్‌ఫేర్‌తో అనుబంధం ఏర్పడక ముందే దాన్ని ఇంట్లోనో లేదంటే ఆఫీసులోనో ఉంచేస్తానంటూ ట్వీట్ చేశారు. మంచి కోసం ఇలా తొలి ఫిల్మ్‌ఫేర్‌ను వేలం వేయాలని విజయ్ నిర్ణయించడం పట్ల ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.