Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి, ఆయన నుంచి వివరణ కోరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం నేరగాళ్లకు అడ్డాగా మారిందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రిని కించపరిచేలా, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాని కార్యాలయాన్ని నేరస్థుల అడ్డా అని చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానిని కలిసే హక్కు ప్రతి ఎంపీకి ఉంటుందని, దేశంలోని ప్రతి పౌరుడికి ఉంటుందని, పీఎం అపాయింట్ మెంట్ ను ఎవరైనా అడగొచ్చని తెలిపారు.
40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ప్రధానిపై వ్యాఖ్యలు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, ప్రధాని, దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తని, అలాంటి వ్యక్తిని కించిపరిచినందుకుగాను ఒక ఎంపీగా చంద్రబాబుకు తాను నోటీసులివ్వాలనుకుంటున్నానని విజయ్ సాయిరెడ్డి చెప్పారు. మోడీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
శివాజీ విడుదల చేసిన వీడియోపైనా విజయ్ సాయిరెడ్డి స్పందించారు. వైసీపీని ఉపయోగించుకుని టీడీపీని అణగదొక్కేందుకు బీజేపీ ఆపరేషన్ ద్రవిడ చేపట్టిందనే అంశంపై మీడియా ప్రశ్నించగా…విజయ్ సాయిరెడ్డి మాట దాటేశారు. ఎవరో సినిమా నటుడు ఒక బోర్డుపై ఏవో బొమ్మలు వేసి ఏదో చెప్పారని, తనకు ఏమీ అర్ధంకాలేదని, తాను కాసేపుమాత్రమే దాన్ని చూశానని,పూర్తిగా చూసిన తర్వాత దానిపై మాట్లాడతానని చెప్పుకొచ్చారు.