Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విదేశీ జట్ల సంగతి తెలియదు కానీ భారత క్రికెట్లో మాత్రం కెప్టెన్సీ మార్పు అనేది ఎప్పుడూ ఓ ప్రహసనాన్ని తలపిస్తుంది. అంతర్గతంగా ఎన్నో రాజకీయాలు, ఎత్తుల పైఎత్తులు, వ్యూహాలు జరిగిన తరువాతే… భారత్ కు కొత్త కెప్టెన్ ఎంపికవుతాడు. కెప్టెన్ హోదాని వదులుకుని దాన్ని గౌరవనీయ పద్ధతిలో మరొకరికి అప్పగించడానికి ఏ స్కిప్పరూ సిద్ధంగా ఉండడు. ఒకరకంగా మన క్రికెట్లో కెప్టెన్సీని ఒకరి నుంచి బలవంతంగా లాక్కొని మరొకరికి ఇష్టపూర్వకంగా అప్పగిస్తుంది బీసీసీఐ. తనను ఎలాగూ తప్పిస్తారని తెలిసి ప్రస్తుత కెప్టెన్ గౌరవప్రదంగా తానే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నట్టు ప్రకటిస్తుంటారు.
భారత క్రికెట్లో ఎప్పుడూ జరిగేది ఇదే. ధోనీ నుంచి విరాట్ కోహ్లీకి కూడా ఈ పద్ధతిలోనే కెప్టెన్సీ మార్పు జరిగింది. కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కలిసి ధోనీకి వ్యతిరేకంగా పావులు కదిపి… అతను తనంతట తానే కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేశారని, కోహ్లీకి, ధోనీకి మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేవని మీడియాలో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలు నిజం కాదంటున్నాడుకోహ్లీ. కెప్టెన్సీ మార్పు చాలా సాఫీగా జరిగిందని..మైదానంలో ఆటగాళ్లు ఎవ్వరూ కూడా ఏదో మార్పు జరిగిన భావనకు లోను కాలేదని కోహ్లీ చెప్పాడు. కెప్టెన్ గా తన తొలిరోజుల్లో ధోనీ జట్టులో ఉండడం తన అదృష్టమన్నాడు విరాట్.
తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధోనీ గురించి, అతనితో తనకు గల స్నేహాన్ని గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు కోహ్లీ. ధోనీతో తనది చెరగని బంధమని, ఎవరేం మాట్లాడినా… ఏం రాసినా తమ బంధాన్ని ప్రభావింతం చేయలేరని కోహ్లీ స్పష్టంచేశాడు. ధోనీకి, తనకు మధ్య విభేదాలున్నట్టుగా చాలామంది కథనాలు సృష్టిస్తారని, తామిద్దరం చేసే ఉత్తమమైన పని.. వాటిని చదవకపోవడమే అని విరాట్ చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరినీ కలిసి చూసినప్పుడు జనాలు వీళ్ల మధ్య ఏ గొడవా లేదా అని ఆశ్చర్యపోతుంటారని, వాళ్లను చూసి తాము నవ్వుకుంటామని, ఏళ్లు గడిచే కొద్దీ తమ మధ్య బంధం మరింత బలపడుతూ వచ్చిందని చీకూ వివరించాడు. ధోనీని మించిన మేధావని తన కెరీర్లో చూడలేదని, అవసరమైనప్పుడు తాను ధోనీ సలహాలు తీసుకుంటానని, పది సందర్భాల్లో అతనిని సంప్రదిస్తే..ఏడెనిమిదిసార్లు అతడి సలహా పనిచేస్తుందని కోహ్లీ తెలిపాడు. వికెట్ల మధ్య పరుగుతీసేటప్పుడు కూడా ధోనీతో తనకు చక్కని సమన్వయం ఉంటుందని కోహ్లీ చెప్పాడు. మొత్తానికి మీడియాలో వార్తలొచ్చినట్టుగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టంచేశాడు కోహ్లీ.