ప‌దేళ్ల అధికారం… పాదయాత్ర అస‌లు ల‌క్ష్యం

Ys-jagan-Praja-Sankalpa-Yat

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్రారంభించారు. ఆరు నెల‌ల పాటు సాగే యాత్ర‌లో 13 జిల్లాల్లో మూడు వేల కిలోమీట‌ర్ల మేర యాత్ర చేయ‌నున్నాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడూ, కొత్త‌గా పార్టీ పెట్టిన త‌రువాత ఓదార్పు యాత్ర‌లు నిర్వ‌హించిన జ‌గ‌న్… ఇప్పుడు తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాట‌లో పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. ప‌ద‌మూడేళ్ల క్రితం తండ్రి పాద‌యాత్ర చేస్తే… ఇప్పుడు కొడుకు ప్ర‌జాసంక‌ల్పయాత్ర పేరుతో యాత్ర చేప‌ట్టారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ లో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా అప్పుడు వైఎస్ యాత్ర చేప‌డితే ఇప్పుడు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టారు. అప్పుడూ ఇప్ప‌డూ తండ్రీ కొడుకుల ఇద్ద‌రి ల‌క్ష్యం… త‌మ పార్టీల‌ను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే.ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉన్న త‌రుణంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఆయ‌న రాజ‌కీయ‌ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైసీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.

ys-jagan-vijayamma-and-ys-s

ఈ ఉద‌యం జ‌గ‌న్ ముందుగా త‌ల్లి ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి బ‌య‌లుదేరారు. అనంత‌రం ఇడుపుల పాయ‌లో వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద కుటుంబ‌స‌భ్యుల‌తో కలిసి తండ్రికి నివాళుల‌ర్పించారు. త‌రువాత బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ఉద్వేగ‌పూరిత ప్రసంగం చేశారు. పాద‌యాత్ర చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను, పాదయాత్ర ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకునే సాగింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం మాఫియా ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని, అలాంటి ప్ర‌భుత్వాన్ని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించివేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. త‌న‌కు కేసులంటే భ‌యం లేద‌ని, డ‌బ్బుల‌పై మ‌మ‌కారం లేద‌ని జ‌గ‌న్ అన్నారు. చ‌నిపోయిన త‌ర్వాత కూడా ప్ర‌తి పేద‌వాడి గుండెలో ఉండాల‌న్న‌దే త‌న క‌సి అని చెప్పారు. విభ‌జ‌న‌లో న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదానే సంజీవ‌ని అని, చంద్ర‌బాబు సుంద‌ర‌ముఖార‌విందాన్ని చూసి రాష్ట్రానికి పారిశ్రామిక వేత్త‌లు రార‌ని, ప్ర‌త్యేక హోదా ఉంటేనే వస్తార‌ని జ‌గ‌న్ చెప్పారు.

Ys-jagan-comments-on-chandr

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి మోడీని ఏమీ అడ‌గ‌లేని స్థితిలో ఉన్నార‌ని ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెచ్చి ప్ర‌తి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాల‌న్న‌దే త‌న కోరిక‌ని తెలిపారు. రాజ‌ధాని నిర్మాణాల‌పై జ‌గ‌న్ చంద్ర‌బాబు వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. చంద్ర‌బాబు రిలీజ్ అయిన ప్ర‌తి సినిమా చూస్తార‌ని, బాహుబ‌లి చూసి, అందులోని సెట్టింగే మ‌న రాజ‌ధాని అంటార‌ని, త‌ర్వాత సింగ‌పూర్ కు వెళ్తే అదే రాజ‌ధాని అంటార‌ని, జ‌పాన్ కు వెళ్లినా అదే మాట మాట్లాడ‌తార‌ని, ఆయ‌న ఇంగ్లీష్ సినిమాలు చూడ‌క‌పోవ‌డం మ‌న అదృష్ట‌మ‌ని జ‌గ‌న్ వ్యంగాస్త్రాలు విసిరారు. బ్ర‌హ్మాండ‌మైన రాజ‌ధాని క‌డ‌తామ‌ని హామీఇచ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు ఒక్క శాశ్వ‌త భ‌వ‌నానికి కూడా ఇటుక వేయ‌లేద‌ని ఆరోపించారు. రాజ‌ధానిపేరుతో త‌న అనుచ‌రుల‌కు మేలు చేశార‌ని, బినామీల భూముల‌ను వదిలేసి రైతుల భూముల‌ను లాక్కున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్ పూర్తిచేసిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ చేసుకుంటున్నార‌ని ఆరోపించిన జ‌గ‌న్… ప్రాజెక్టులు క‌ట్టిన వ్య‌క్తి గొప్పా… గేట్లు ఎత్తిన వ్య‌క్తి గొప్పా అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

ysrcp mlas join tdp list

పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని, క్యాబినెట్ ప‌రిశీలిస్తే… ఎవ‌రు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. నంద్యాల‌లో గెలిచామ‌ని అంటున్నార‌ని, రూ. 200కోట్లు పంచి అక్క‌డ గెలిచార‌ని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వ‌స్తే ఎవ‌రు గెలుస్తారో తెలుస్తుంద‌ని జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబ‌మూ సంతోషంగా లేద‌ని, త‌న పాల‌నా కాలంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌నూ చంద్ర‌బాబు మోసంచేశార‌ని, అందుకే ఇప్పుడు చంద్ర‌బాబు లాంటి మోస‌గాడు దేశంలోనే లేర‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు పాల‌న నుంచి బ‌య‌ట‌ప‌డేస్తామ‌నే భ‌రోసా ఇవ్వ‌డానికే ఈ పాద‌యాత్ర మొద‌లుపెట్టామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు వ‌య‌స్సులో త‌న వ‌య‌సు సగం కూడా ఉండ‌ద‌ని, అయినా త‌న‌ను రాజ‌కీయాల నుంచి త‌ప్పించాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం చూస్తే బాధ క‌లుగుతోంద‌ని, అయితే వైఎస్ అందించిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసిన‌ప్పుడు ఆ బాధ నుంచి ఊర‌ట‌క‌లుగుతుంద‌ని అన్నారు.

ys-jagan-speech-in-praja-sa

ఎనిమిదేళ్ల‌గా తాను ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో పోరాటం చేస్తున్నాన‌ని, రాజ‌కీయాల్లో తాను చేయ‌ని పోరాటం లేద‌ని, త‌న ప్ర‌తి అడుగులోనూ ప్ర‌జ‌లంద‌రూ అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, అందుకే త‌నను చూస్తే చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్ర అప్పు రూ. 96వేల కోట్లు కాగా, చంద్ర‌బాబుపాల‌న‌లో అది రూ.రెండు లక్ష‌ల ఆరువేల కోట్ల‌కు పెరిగిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా… ప్ర‌తి ప్రాంతానికి వెళ్లి, ప్ర‌తి సామాజిక వ‌ర్గాన్ని, ప్ర‌తి ఒక్క‌రిని క‌లుస్తామ‌ని, వాళ్ల క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకుని అధికారంలోకి వ‌చ్చాక వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. వైసీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల‌ను మ‌రింత మెరుగుప‌ర్చేందుకు ప్ర‌జ‌ల స‌ల‌హాలు తీసుకుంటామ‌ని, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండే పేజీల‌తో మ్యానిఫెస్టో రూపొందిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

tdp-manifesto-2014

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ మ్యానిఫెస్టో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో కూడా దొర‌క‌డంలేద‌ని, హామీలు నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తార‌న్న భ‌యంతోనే మ్యానిఫెస్టోను మాయం చేశార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాము 2019 ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఇచ్చే ప్రతి హామీని నెర‌వేరుస్తామ‌ని, చెప్పిన‌వే కాకుండా… చెప్ప‌నివీ చేస్తామ‌ని… 2024 ఎన్నిక‌ల్లో ఇదే చెప్పి ప్ర‌జ‌లను ఓట్లు అడుగుతామ‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా జ‌గ‌న్ వైసీపీ ప‌దేళ్ల రాజ‌కీయ ల‌క్ష్యాల‌ను ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు. 2003లో వైఎస్ పాద‌యాత్ర త‌రువాత‌ కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. అదే త‌ర‌హాలో త‌న పాద‌యాత్ర కూడా 2019తో పాటు 2024 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ని అధికారంలోకి తీసుకొస్తుంద‌ని, ప‌దేళ్ల‌పాటు తాను న‌వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చ‌క్రం తిప్పుతాన‌ని జ‌గ‌న్ కంటున్న క‌ల‌లు నెర‌వేర‌తాయా లేదా అన్న‌ది కాల‌మే చెప్పాలి.