Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
35 ఏళ్ల ధోనీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీలు ఇస్తున్న సలహాలకు మహేంద్రుడు స్పందించలేదు కానీ…కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం దీటుగా బదులిచ్చాడు. అందరూ ధోనీని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తనకు అర్ధం కావడం లేదని విరాట్ వ్యాఖ్యానించాడు. ఒక బ్యాట్స్ మెన్ గా తాను వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమైనా..పెద్దగా ఎవరూ పట్టించుకోరని, ఎందుకంటే తన వయసు ఇంకా 35 ఏళ్లు కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ధోనీ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని, అన్ని టెస్టుల్లోనూ అతను పాసవుతున్నాడని తెలిపాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ధోనీ ఎంతగానో ఆదుకుంటున్నాడని, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లో ధోనీ బాగానే రాణించాడని, న్యూజిలాండ్ తో సిరీస్ లో మాత్రం ఎక్కువసమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదని, ఈ మాత్రానికే అతన్ని విమర్శించడం సరికాదని కోహ్లీ అన్నాడు.
ఈ సిరీస్ లో ధోనీతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా పెద్దగా రాణించలేదని, మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. న్యూజిలాండ్ చేతిలో రెండో టీ20లో భారత్ ఓడిపోయిన తర్వాత…ధోనీ టీ20ల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ బయలుదేరింది. టీ20లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం సరికాదని మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోనీకి మద్దతు పలికారు. టీ 20ల నుంచి తప్పుకోవడం ధోనీకి మేలుచేయదని గవాస్కర్ అభిప్రాయపడగా.. ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి తెలుసని, కాకపోతే…జట్టులో తన పాత్రేమిటో అతను తెలుసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు.