Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెరుపులు, ఉరుములు లేకుండా పిడుగు పడితే ఎలా ఉంటుంది? ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ పోటీకి దిగడం కూడా అలాగే వుంది. ఈ పరిణామాన్ని అక్కడ పోటీ పడుతున్న రాజకీయ పక్షాలకు ఊహించని షాక్. అయితే ఆ షాక్ ఇచ్చింది ఇంకెవరో కాదట. బెంగుళూరు అరప్పణ జైల్లో కూర్చున్న శశికళ అని తాజా టాక్. పోటీలో నిలుచున్న దినకరన్ తరపున ఆమె ఈ వ్యూహరచన చేసినట్టు తమిళనాడు గుప్పుమంటోంది. విశాల్ పోటీకి, శశికళకు సంబంధం ఏంటా అని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర వాదనలు, విషయాలు బయటకు వచ్చాయి.
ఆర్కే నగర్ లో తమిళనాట సెటిల్ అయిన తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ప్రజలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరిని ఆకట్టుకోడానికే అన్నాడీఎంకే తరపున తెలుగు మూలాలు వున్న మధుసూదన్ ని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం రంగంలోకి దించారు. మధుసూదన్ స్థానికుడు కావడంతో పాటు తెలుగు మూలాలు ఉండటమే ఆయనకు ప్లస్ పాయింట్ గా ఆ నేతలు భావించారు. వారి వ్యూహానికి విరుగుడుగా దినకరన్ కి కలిసి వచ్చేట్టు శశికళ బృందం ఏ మచ్చ లేని తెలుగు వ్యక్తిని బరిలోకి దించాలని ప్లాన్ చేసిందట.
అయితే ఆ వ్యక్తి వెనుక తాము ఉన్నట్టు అనుమానం రాకుండా ఉండేందుకు నిజాయితీ గల వాడన్న ఇమేజ్ కలిగిన విశాల్ ని ఎంచుకుందట. అతని ఆర్ధిక కష్టాలు తీర్చి ఆర్కే నగర్ ఎన్నికల్లో పాల్గొనేలా ఒప్పించినట్టు తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విశాల్ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. విశాల్ గెలుపుని ఆపడానికి రాజకీయ ప్రత్యర్ధులు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఎదురు దాడి చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో… ఏది అబద్ధమో ?