Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ఈ కామర్స్ మార్కెట్ లో ఇక అమెరికా గుత్తాధిపత్యం సాగనుంది. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో మెజార్టీ వాటాను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సొంతం చేసుకుంటోంది. ఈ మేరకువచ్చే వారంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగొచ్చని ఈ పరిణామాలతో దగ్గర సంబంధమున్న వ్యక్తులు చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఒప్పందం విలువ 18 బిలియన్ డాలర్లని, భారత కరెన్సీలో దాదాపు రూ. 1.19లక్షల కోట్లని తెలుస్తోంది. భారత ఈ కామర్స్ విభాగంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఫ్లిప్ కార్ట్ లో 51 శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలుచేసేందుకు వాల్ మార్ట్ కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఈ వాటాను సొంతం చేసుకునేందుకు వాల్ మార్ట్ రూ. 66వేల కోట్ల నుంచి రూ. 80వేల కోట్లు వెచ్చించే అవకాశమున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.
అయితే ఫ్లిప్ కార్ట్ లో అయిదింట ఒక వంతు షేర్లు కలిగి ఉన్న జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్…వాల్ మార్ట్ ఆఫర్ చేసిన ధర తక్కువగా ఉందన్న కారణంతో షేర్ల విక్రయానికి విముఖత వ్యక్తంచేసింది. ఒప్పందంలో భాగంగా 18 బిలియన్ డాలర్ల విలువైన ఫ్లిప్ కార్ట్ కొత్త షేర్లను, వాల్ మార్ట్ కొనుగోలు చేయనుంది కానీ…సాఫ్ట్ బ్యాంక్ షేర్లపై స్పష్టతలేదు. ఫ్లిప్ కార్ట్, వాల్ మార్ట్ ఒప్పందం పూర్తయితే…దేశీయ ఈ కామర్స్ లో మెజారిటీ వాటా అమెరికా కంపెనీ చేతుల్లోకి వెళ్లినట్టే. మొదటిస్థానంలో ఉన్న ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేయడం ద్వారా వాల్ మార్ట్ ఆ స్థానంలోకి వెళ్తుంది. ఇక అమెరికాకు చెందిన అమెజాన్ ఇప్పటికే రెండో స్థానంలో ఉంది. అమెజాన్ మాజీ ఉద్యోగులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ 2007లో ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించారు. అనతికాలంలోనే దిగ్గజసంస్థగా ఎదిగింది. ఇప్పుడు మెజారిటీ వాటాను విక్రయించాలని సచిన్, బిన్నీలు భావిస్తున్నారు. దీన్ని కొనుగోలు చేసేందుకు అమెజాన్ కూడా పోటీకి వచ్చినప్పటికీ…వారు మాత్రం వాల్ మార్ట్ వైపే మొగ్గుచూపారు. డీల్ దాదాపు పూర్తయిందని, మే మొదటివారంలో దీనిపై స్పష్టతవస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.