తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగాయి. గవర్నర్ తన ప్రసంగంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను చదివారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు దీంతో ఆయన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ చదువుతారని ఆయన అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ మేనిఫెస్టోనే అక్కడి గవర్నర్లు చదువుతారని తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మేనిఫెస్టోనే ఇక్కడి గవర్నర్ చదువుతారని చెప్పారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలనే కాకుండా, మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తాము అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో లేని 72 పథకాలను తాము అమలు చేశామని తెలిపారు. ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన తర్వాత కూడా కాంగ్రెస్ మైండ్ సెట్ ఇంకా మారడం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని చెప్పారు. అలాగే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం కనీసం రూ. 24 రూపాయలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను తప్ప అదనంగా ఒక్క రూపాయిని కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ. 2.40 లక్షలు కోట్లని ఈ అప్పును చెల్లిస్తే మళ్లీ రూ.1.30 లక్షల కోట్లను అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మార్చి నాటికి మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పింఛన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. ఇక అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పదని కేసీఆర్ కితాబిచ్చారు. గొప్ప పథకాన్ని అభినందించడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని, కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోడీకి కూడా తెలిపానని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుందని దాన్ని మరింత మెరుగు పరిచి తాము కొనసాగిస్తున్నామని ఈ పరిస్థితుల్లో తమకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదని మోదీకి చెప్పానని కేసీఆర్ తెలిపారు. 108 అంబులెన్స్ పథకం కూడా చాలా బాగుందని ఆయన చెప్పారు. అయితే ఇంతకు ముందు వైఎస్ అంటేనే మండిపడే కేసీఆర్ నిజంగా పధకాలు నచ్చే ఇలా మాట్లాడారా ? లేక ఇప్పుడు ఏపీలో జగన్ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడారా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు కూటమి అంటూ తెలుగుదేశంతో పోటీ చేసినప్పుడు రాజా ఆఫ్ కరప్షన్ అంటూ పుస్తకాలు వెయిన్చీన టీఆర్ఎస్ ఈరోజు వైఎస్ ను ఎందుకు మోస్తోందో ? అర్ధం చేసుకోలెంత పిచ్చి వారు కాదు కదా జనం.