Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామిపై దినకరన్ అన్నివైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నారు. వీలైనంత త్వరగా శశి ప్రభావం నుంచి పార్టీని ఒడ్డునపడేయాలని పళని, పన్నీర్ భావిస్తుంటే.. దినకరన్ మాత్రం అంతకంతకూ రెచ్చిపోతున్నారు. ఈ నెల 12న జరగబోతున్న జనరల్ బాడీ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లొద్దని దినకరన్ బెదిరిస్తున్నారు.
ఈసీ రికార్డుల ప్రకారం ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళే. జనరల్ బాడీ మీటింగ్ పిలిస్తే ఆమే పిలవాలి. లేదంటే ఆమె అనుమతితో ఎవరైనా పిలవచ్చు. కానీ శశికళ అనుమతి లేకుండా పళని, పన్నీర్ జనరల్ బాడీ మీటింగ్ ఎలా పెడతారని దినకరన్ నిలదీస్తున్నారు. అనవసరంగా సమావేశానికి హాజరై ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ఆయన ఎమ్మెల్యేల్ని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే పళని, పన్నీర్ నిర్వహించిన కీలక మీటింగ్ కు పుదుచ్చేరి రిసార్ట్ లో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. తాజా దినకరన్ బెదిరింపులు, అన్నాడీఎంకేల స్లీపర్ సెల్స్ ఉన్నారన్న వార్నింగులతో మరికొందరు జనరల్ బాడీ మీటింగ్ కు గైర్హాజరౌతారేమోనని పళని, పన్నీర్ శిబిరం టెన్షన్ పడుతోంది. దినకరన్ కారణంగా కేంద్ర క్యాబినెట్లో కూడా బెర్తులు దక్కలేదని వారు మథనపడుతున్నారు.