రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రెండు నెలలు గడిచిపోయినా ఇంత వరకు క్యాబినెట్ విస్తరణ చేపట్టలేదు. మంత్రి మండలి విస్తరణకు మంచి ముహూర్తం కుదరకపోవడం వల్లే ఆలస్యమైందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి, నిజానికి ఇది చాలా సిల్లీ రీజన్ అయినా ముహూర్తాలను నమ్మే కేసీఆర్ కు ఇది పెద్ద విషయమే. దీంతో ఇప్పుడు మంచి ముహూర్తాలు దొరకడంతో రెండు రోజుల కిందట గవర్నర్ నరసింహన్‌ను కలిసిన తెలంగాణ సీఎం క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 19న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలియజేయడంతో, ఎవరెవరికి చోటు దక్కుతుందనే స్పష్టత వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూర్తిస్థాయి కసరత్తు అనంతరం తుది జాబితాను కేసీఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి విడత విస్తరణలో తొమ్మిది మందికి చోటు కల్పించినున్నట్టు సమాచారం. విస్తరణలో ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ఈ విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు దక్కదని, ఇప్పటికే మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ జిల్లా నుంచి ఎవర్నీ మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.
మంత్రి పదవులు వరించే ఎమ్మెల్యేల పేర్లను ఖరారు చేశారు. కేటీఆర్‌ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడంతో ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని సమాచారం. పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించాలనే సీఎం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత క్యాబినెట్‌లో పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మరోసారి చోటు దక్కనుంది. హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు ఈసారి అవకాశం లేనట్లేనని సమాచారం. కేసీఆర్ క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్న వారిలో ఆదిలాబాద్- ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్- తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిజామాబాద్- వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్ – కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్- వి. శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నల్లగొండ- జి. జగదీశ్ రెడ్డి, వరంగల్- ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా అమాత్యుల కూర్పు జరిగిందని అంటున్నారు. అయితే దీని మీద అధికారక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.