యజువేంద్ర చాహెల్, కుల్దీప్ యాదవ్. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఇండియాకు కీలకం. మరి ఈ ఇద్దరూ ఇవాళ మాంచెస్టర్‌లో ఏం చేస్తారన్నదే సందేహం. కివీస్‌తో జరిగే సెమీస్ పోరుకు.. తుది జట్టులో ఇద్దరికీ చోటు దక్కుతుందా లేక ఏదైనా ఒకే స్పిన్నర్‌కు అవకాశం ఇస్తారా అన్నది మరో కోణం. వాస్తవానికి ఈ ఇద్దర్నీ ఇటీవల టీమిండియా దూరం పెట్టిన సందర్భం చాలా అరుదు. తాజా వరల్డ్‌కప్‌లో కుల్దీప్ పెద్దగా రాణించలేదు. కానీ మిడిల్ ఓవర్స్‌లో మాత్రం అతను కీలకంగా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థులకు ఎక్కువగా పరుగులు సమర్పించలేదు. అడపాదడపా కొన్ని మ్యాజిక్ బంతులతో ఆకట్టుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌ను కుల్దీప్ ఔట్ చేసిన తీరు హైలైట్. ఇక కివీస్ బ్యాట్స్‌మెన్‌ను మన స్పిన్నర్లు గతంలో బాగానే కట్టడి చేశారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఈ ఇద్దరు స్పిన్నర్లు పలు సందర్భాల్లో ఔట్ చేశారు. కుల్దీప్, చాహెల్ బౌలింగ్‌లో విలియమ్సన్ యావరేజ్ కేవలం 17.75 మాత్రమే ఉంది. కివీస్ బ్యాట్స్‌మెన్ దూకుడును అడ్డుకునేందుకు స్పిన్నర్లు బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కానీ శ్రీలంకతో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. స్లో వికెట్‌పై అతను కీలకంగా రాణించాడు. అయితే బ్యాట్స్‌మెన్‌గా జాడేజా ఉపయోగపడే ఛాన్సు ఉంది కాబట్టి.. అతన్ని కూడా తీసుకుంటారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మణికట్టు మాంత్రికులు ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనున్నది.