Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రంతో పాటు… అనేకరాష్ట్రాల్లో వరుస విజయాలతో తమకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీకి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లు షాకిచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీ, అమిత్ షా వెన్నంటి నిలిచారు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఆ రాష్ట్రంలో అఖండ విజయం సాధించినట్టే లెక్క. ఒకరకంగా బీజేపీ ఆధిపత్యానికి యూపీలో గెలుచుకున్న సీట్లే బీజం వేశాయి. మొన్నటికి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించిన బీజేపీకి రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు మాత్రం కోలుకోలేని షాకిచ్చాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు ఒకప్పుడు కంచుకోటయిన గోరఖ్ పూర్ లో బీజేపీ ఎస్పీ, బీఎస్పీ చేతిలో ఓటమిపాలయింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో మూడు నెలల కాలంలో పరిస్థితులు ఇలా ఎందుకు అనూహ్యంగా మారిపోయాయి?
బీజేపీకి హఠాత్తుగా ఎందుకిలా ఎదురుగాలి వీస్తోంది? ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేయడం వల్ల బీజేపీకి నష్టం జరిగిందన్నఅభిప్రాయం వినిపిస్తోంది. దీంతో పాటు గోరఖ్ పూర్ లో బీజేపీ ఓటమికి టీడీపీ నేతలు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. ఏపీ దెబ్బ బీజేపీకి యూపీలో తగిలిందంటున్నారు టీడీపీ నేతలు. గోరఖ్ పూర్ లో అత్యధికంగా ఉన్న తెలుగువారు బీజేపీకి గుణపాఠం చెప్పారని వినుకొండ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం, విజయనగరం వాసులు అనేకమంది గోరఖ్ పూర్ కు వలస వెళ్లారని, ఏపీని బీజేపీ మోసం చేయడంతో… ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారన్నది ఆయన అభిప్రాయం. అయితే ఈ విశ్లేషణలు పక్కనపెడితే… ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశ ప్రజల ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయని మాత్రం చెప్పొచ్చు. నియంతృత్వం తరహా పోకడలు ప్రదర్శిస్తున్న ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహార శైలిపై ప్రజల్లో అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రాష్ట్రాలతో కేంద్రం వైఖరి కూడా ప్రజలు గమనిస్తున్నారు.
తమ మాట వినని, తమకు అడ్డుగా ఉంటారని భావిస్తున్న రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను మోడీ ఉసిగొల్పుతున్నతీరు వ్యతిరేకప్రభావం కలిగిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వ్యవహారశైలి కూడా దేశప్రజల్లో మోడీపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతోంది. విభజనకు ముందు ప్రత్యేక తెలంగాణకు దేశంలో ఎక్కువమంది ప్రజలు మద్దతుగానే ఉన్నప్పటికీ… విభజనతీరు అందరినీ ఆలోచనలో పడేసింది. కాంగ్రెస్ ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం, ఏపీకి తీవ్ర అన్యాయం చేయడం అనేక సందేహాలు కలిగించింది. అదే సమయంలో మోడీ… బీజేపీ అధికారంలోకి వస్తే… విభజన బాధిత ఏపీని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఇచ్చిన హామీని… ఏపీ ప్రజలతో పాటు… మిగిలిన దేశమంతా నమ్మింది. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా విభజన హామీలు అమలుచేయకపోవడం, బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ ఏపీ ఎంపీలు పార్లమెంట్ ను స్తంభింపచేయడం, కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం వంటి పరిణామాలు మోడీని వేలెత్తిచూపేలా చేశాయి. నాలుగేళ్లుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ… అధికారంలో ఉన్న రాష్ట్రానికే ఏమీ చేయని మోడీ… మిగిలిన రాష్ట్రాలకు ఏమైనా చేస్తారా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. టీడీపీ పోరాటం తర్వాతయినా కేంద్రప్రభుత్వం మనసు మార్చుకోకపోవడం ఏపీ ప్రజల్నేకాదు… దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రాలపై బలవంతంగా అధికారం రుద్దడం, ఏపీ వంటి రాష్ట్రాన్ని గాలికొదిలేయడం వంటివన్నీ నెమ్మదిగా మోడీ, షా ద్వయంపై వ్యతిరేకత పెంచుతున్నాయి. యూపీతో పాటు బీహార్ లోనూ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటు దీని ఫలితమే. అయితే ఈ ఫలితాలతో ప్రజల్లో పూర్తిగా బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తే పొరపాటు పడ్డట్టే. ఆ పార్టీకి జాతీయస్థాయిలో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం, మోడీ వంటి ఛరిష్మా ఉన్న నేత దేశ రాజకీయాల్లో ప్రస్తుతం కానరాకపోవడం, కొన్ని రంగాల్లో అభివృద్ధి వంటి అంశాలు బీజేపీకి ఇప్పటికీ ఓట్లు కురిపించే అస్త్రాలే. అయితే ఈ ఉప ఎన్నికలను గుణపాఠంగా స్వీకరించి… గత తప్పులను దిద్దుకుంటే… బీజేపీకి సమీప భవిష్యత్తులో ఇలాంటి పరాభవాలు, పరాజయాలు తప్పుతాయి.