ప్రియుడితో కలిసి భర్తను చంపడం… నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం తర్వాత తెలుగురాష్ట్రాల్లో ఈ తరహా దారుణాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలు బలితీసుకుంటున్న ఇలాంటి ఘటనలతో సమాజంపై అపనమ్మకం పెరిగిపోతోంది. భారతీయులు గొప్పగా భావించే వివాహ బంధాన్ని ఈ దారుణాలు అపహాస్యంచేస్తున్నాయి. తాజాగా పాలమూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రియుడితో తన భర్తను హత్యచేయించడం కలకలం రేపింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ హత్యకేసును చేధించారు. వివరాల్లోకెళ్తే… మహబూబ్ నగర్ జిల్లా రాచర్లకు చెందిన 24 ఏళ్ల జ్యోతికి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు. నాగరాజు భార్యా,పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీ ఉదయం నుంచి తన భర్త కనిపించడం లేదని జ్యోతి బంధువులకు సమాచారమిచ్చింద. ఆ రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని తెలిపింది. అదేరోజు నాగరాజు మృతదేహం చౌటుప్పల్ ఠాణా పరిధిలో పోలీసులకు దొరికింది. నాగరాజు జేబులో చీటీ ఆధారంగా పోలీసులు అతడి చిరునామా గుర్తించి భార్య జ్యోతికి ఫోన్ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జ్యోతి భర్త మృతదేహాన్ని చూసి భోరున ఏడ్చింది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు నాగరాజు మృతదేహాన్ని జ్యోతికి అప్పగించారు. జనవరి 2న కుటుంబ సభ్యులు స్వగ్రామం రాచర్లకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ చూసిన తర్వాత పోలీసులకు జ్యోతిపై అనుమానమొచ్చింది. నాగరాజు తల వెనక దెబ్బలున్నాయని రిపోర్ట్ లో ఉండడంతో పోలీసులు అతని ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. డిసెంబర్ 30న స్విచ్చాఫ్ అయినట్టు తేలింది. వెంటనే జ్యోతి ఫోన్ వివరాలు ఆరా తీశారు.
డిసెంబరు 30, 31తేదీల్లో ఒకే నంబర్ కు ఆమె ఫోన్ నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. ఆ నంబర్ కార్తీక్ దిగా గుర్తించారు. దీంతో పోలీసులు జ్యోతి, కార్తీక్ లను అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్యచేశామని అంగీకరించారు. విచారణలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. జ్యోతికి కార్తీక్ తో నాగరాజుతో పెళ్లికిముందు నుంచే పరిచయం ఉంది. నాచారంలో ఉంటున్న మేనమామ ఇంటికి తరచుగా వెళ్లే జ్యోతికి అక్కడికి సమీపంలోనే ఉండే కార్తీక్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లికూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఆమెను నాగరాజుకు ఇచ్చి వివాహంచేశారు. ఉపాధికోసం నాగరాజు భార్యాబిడ్డలతో కలిసి కర్మన్ ఘాట్ లో ఉంటుండగా… జ్యోతి జీవితంలోకి కార్తీక్ మళ్లీ వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. నాగరాజుకు విషయం తెలిసి భార్యను హెచ్చరించడంతో కార్తీక్ ను కలవడం మానేసినా… ఇటీవల నాచారంలో మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు. నాగరాజును చంపేస్తే తమకు అడ్డుఉండదని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని కార్తీక్ తన స్నేహితులు దీపక్, యాసిన్, నరేష్ లకు చెప్పగా వారు సహరించడానికి ఒప్పుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు హడావుడిలో ఉంటారని, ఆసమయంలో హత్యచేస్తే అనుమానం రాదని జ్యోతి కార్తీక్ కు చెప్పింది. డిసెంబర్ 30రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, అతను మత్తులోకి జారుకోగానే కార్తీక్ కు ఫోన్ చేసింది. అతను వచ్చాక దిండుతో ఇద్దరూ కలిసి నాగరాజు ముఖంపై బలంగా ఒత్తి చంపేశారు. కార్తీక్ తన స్నేహితులతో కలిసి కారులో చౌటుప్పల్ ఠాణా పరిధిలో నిర్జన ప్రాంతంలో నాగరాజు మృతదేహాన్ని పడవేసి వెళ్లిపోయాడు. హత్య విషయం వెలుగుచూసిన తర్వాత కార్తీక్ స్నేహితులు దీపక్, యాసిన్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మరో నిందితుడు నరేష్ భయంతో గొంతు కోసుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నరేష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాగరాజును భార్యే హత్యచేయించడం వారి స్వగ్రామం రాచర్లలో తీవ్ర కలకలం రేపింది.