ప్రైవేటు బస్సు డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న మహిళ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన హైదరాబాద్ లోని మూసాపేటలో జరిగింది. మూసాపేట సమీపంలోని హెచ్‌పీ రోడ్డులో ఈనెల 2వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పెనుగొండ బి.వి.నాగేశ్వర్రావు(47) కేసును సనత్‌నగర్ పోలీసులు సాల్వ్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా అతడి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వర్రావు హైదరాబాద్ లోని మూసాపేటలో స్థిరపడ్డారు, ఆయనకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. వీరు హైదరాబాద్, విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే కనకదుర్గ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసే కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన కన్నాతో వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో నాగేశ్వర్రావు ఇంటికి తరుచూ వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే నాగమణి, కన్నా మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని కన్నా భార్య నాగేశ్వర్రావుకు చెప్పడంతో అతడు భార్యను హెచ్చరించాడు. కన్నాను కూడా ఇంటికి రావొద్దని చెప్పేశాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్న నాగేశ్వర్రావును అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. నాగేశ్వర్రావును హత్యచేస్తే రూ.50వేలు ఇస్తానని కన్నా తన స్నేహితుడు షేక్ సుభానీకి చెప్పడంతో అతడు అంగీకరించాడు. దీంతో సుభానీని రెండు రోజులపాటు నాగేశ్వర్రావు ఇంటికి పంపాడు. ఈనెల 1న సుభాని, నాగేశ్వర రావు మద్యం తాగారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నాగేశ్వర్రావును సుభానీ కత్తితో పొడిచి చంపేశాడు. అనుమానాస్పద మ్రుతిగా నమోదు చేసుకున్న పోలీసులు నాగమణి మీద నిఘా పెట్టి ఆమె కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.