Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ వివాహం వివాదం తరుచూ వార్తల్లోకెక్కుతోంది. కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో మరోసారి ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెళ్లికాగానే నిర్దాక్షిణ్యంగా భార్యను వదిలేసిన మోడీకి ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడే అర్హత లేదని పలువురు వాదిస్తున్నారు. మోడీ భార్య జశోదాబెన్ కు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోడీ తన భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల ఆరురోజులుగా నిరాహారదీక్షను చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో ఆమె క్లినిక్ నడుపుతున్నారు.
జశోదాబెన్ తో తన వివాహం చెల్లదని మోడీ చెబుతున్నారని, అలాంటప్పుడు ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. మరోవైపు తనకు ఏ హోదాలో భద్రతను కల్పిస్తున్నారో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా… తన భద్రతాసిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండడం తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆమె అసహనం వ్యక్తంచేశారు. మోడీ తన పాస్ పోర్టులో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో కూడా తెలియజేయాలని ఆర్టీఐ అధికారులను కోరారు.