భర్త చనిపోయిన మహిళ మరో వ్యక్తిని పెళ్లాడాలని భావించింది. అందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి వారిని అడ్డుతొలగించుకోవాలనుకుంది. కుమార్తెను (మైనర్) విక్రయించి.. కుమారుడిని హాస్టల్లో వదిలిపెట్టింది. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో చోటుచేసుకుంది.
రాంచీకి చెందిన దంపతులు ఇద్దరు పనుల కోసం కొన్నేళ్ల క్రితం ముజఫర్‌పుర్ వచ్చారు. భర్త రెండేళ్ల కిందట మరణించడంతో.. ఆ మహిళ అక్కడే ఉండే ఓ వ్యక్తి ప్రేమలో పడి, అతణ్నిపెళ్లాడాలనుకుంది. ఆ వ్యక్తి పిల్లలతో వస్తే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో నిందితురాలు తన కుమార్తెను (మైనర్) ఓ వ్యాపారవేత్త(35)కు విక్రయించింది. కుమారుడిని ఓ ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహంలో దించి దిల్లీ వెళ్లిపోయింది.
హాస్టల్ ఫీ చెల్లించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తాత, మామయ్య వచ్చి నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులు .. వ్యాపారవేత్తను, బాలిక విక్రయంలో సహకరించిన దంపతులను అరెస్టు చేశారు. ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.