ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్19 మహమ్మారి కావడంతో ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. వైరస్ వ్యాప్తి అంశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు డబ్ల్యూహెచ్‌వో ఆలస్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తుంది. ఇదే అంశంపై చైనా పట్ల పక్షపాతంగా ఉన్నట్లు కూడా ఆ దేశం విమర్శించింది.
అయితే ఈ సారి జరిగే డబ్ల్యూహెచ్‌వో సమావేశాల్లో భారత్ పాల్గొననుంది. మే 18-19 తేదీల్లో జరిగే వర్చువల్ సమావేశాలు, ఆ తర్వాత 34 దేశాల సభ్యులతో బోర్డు సమావేశాలు ఈ నెల 22న జరగనున్నాయి. ఆ సమావేశాల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో నుంచి బాధ్యతయుతంగా సమాధానాలు రాబట్టేందుకు భారత్ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.
అదేవిధంగా ప్రతి ఏడాది డబ్ల్యూహెచ్‌వో అసెంబ్లీ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతాయి. అక్కడ డబ్ల్యూహెచ్‌వో విధానాలను పొందుపరుస్తారు. డైరక్టర్ జనరల్‌ను నియమిస్తారు. బడ్జెట్, ఆర్థిక వ్యవహారాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం కోవిడ్19 విషయంలో డైరక్టర్ టెడ్రోస్ గెబ్రియాసిస్పై విమర్శలు పెద్దఎత్తున వస్తున్న నేపథ్యంలో భారత్ విధానపరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది చూడాలి. ఈ సమావేశాల్లో మూడేళ్ల పాటు సభ్యదేశంగా భారత్ ఎన్నిక కానుంది. అలాగే.. వైరస్ విషయంలో చైనాను, డబ్ల్యూహెచ్‌వోను బాధ్యత తీసుకునేలా చేయాలని అమెరికా కొన్ని దేశాలపై వత్తిడి తెస్తుంది. ఆరోగ్య సంస్థలో పారదర్శకత పెరగాలని కూడా ఆ దేశం ఆదేశిస్తున్నది.
కాగా ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నాం.. గ్లోబల్ హెల్త్ మేనేజ్మెంట్ ఎలా ఉందన్న అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కోవిడ్ విషయంలో చైనాపై ఎటువంటి నిర్ణయాన్ని భారత్ వెల్లడించబోదని తెలుస్తోంది. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నిధులు కత్తించిన అంశంపై కూడా భారత్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ భారత్‌ను అడ్డుకొనేందుకు చైనా ఎత్తులు వేస్తున్నట్లు నిపుణులు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా జీ20 వర్చువల్ సమావేశంలో పిలుపు నిచ్చారు. ప్రస్తుత శతాబ్ధానికి తగినట్లు ఆరోగ్య సంస్థ మారాలని కూడా మోడీ స్పష్టం చేశారు.