విజయనగరం జిల్లా ఈ జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మహామహులకే అంతుచిక్కదు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణాలు రెండంటే రెండు మాత్రమే అనేది నా ప్రగాఢ నమ్మకం. అవి 1. బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ అంటూ టీడీపీ ఇచ్చిన హామీ, 2.జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఈ రెండు కారణాలు మాత్రమే టీడీపీని గత ఎన్నికల్లో గెలిపించాయి. అందుకు తిరుగులేని నిదర్శనం ఏంటంటే శ్రీకాకుళం పార్లమెంటు నుంచి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు వరకు మొత్తం 15 లోక్ సభా స్థానాలు ఉండగా కేవలం ఒకే ఒక్క లోక్‌సభా స్థానంలో మాత్రమే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించగలిగింది. సహజంగా ఈ ప్రాంతం లో కాపు ఓటర్లు అత్యధికంగా ఉంటారు. పవన్ కల్యాణ్ పై అభిమానంతో వారంతా గత ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపారు కాబట్టే టీడీపీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. ఈ 15లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది కాపు ఓటర్ల ప్రభావం లేని ఒక్క అరకులో మాత్రమే. ఇక ఒంగోలు లోక్ సభ నుంచి హిందూపురం వరకు 10 లోక్ సభా స్థానాలు ఉండగా.. వీటిలో ఏకంగా 8 లోక్ సభాస్థానాలను వైసీపీ గెలుచుకుంది. కాపు ఓటర్ల ప్రభావం లేని చోట్ల వైసీపీ వైపు ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. అయినా ఇదంతా వేరే కథ. ఈ విషయాలను ఇక్కడ కాదు వేరే ఏదైనా సందర్భంలో ప్రస్తావిస్తాను. ప్రస్తుత విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు రావడానికి పై రెండు కారణాలతోపాటు ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం మరో కారణం కూడా ఉంది. దాని పేరు #బొత్స. అవును బొత్స కుటుంబం కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేయడంతో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి దెబ్బే తగిలింది.
*
విజయనగరం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందుగా బొత్స కుటుంబం గురించి చర్చించుకోవాల్సిందే. బొత్స సోదరులు సత్యనారాయణ, అప్పలనరసయ్య, బొత్స మేనల్లుడు చిన్న శ్రీనివాసరావు, బొత్స బంధువు అప్పలనాయుడు, బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ వీరంతా 2009 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో చక్రం తిప్పారు. ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 7 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పైన నేను పేర్కొన్న ఐదుగిరిలో మజ్జు ( చిన్న) శ్రీనివాసు మినహా మిగిలిన నలుగురూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీలతో గెలుపొందారు. ఈ కుటుంబం 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫునే పోటీ చేసి వైసీపీకి కోలుకోలేని నష్టం చేకూర్చింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ర్టంలోనే మరే నాయకుడికి రానన్ని ఓట్లు (ఈ వివరాలన్నీ ఇదే వ్యాసంలో దిగువన రాశాను. గమనించగలరు) ఈ జిల్లాలో సత్తిబాబుకు, అప్పలనరసయ్యకు, ఝాన్సీకి, అప్పలనాయుడికి వచ్చాయి. రాష్ర్ట విభజనకు అనుకూలంగా బొత్స సత్యనారాయణ ప్రకటనలు ఇచ్చినా సరే.. ఏపీ మొత్తం బొత్స తీరును విభజన సమయంలో తూర్పారబట్టినా సరే ఆ కుటుంబం గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో గణనీయమైన ఓట్లు సాధించి (ఈ వివరాలన్నీ ఇదే వ్యాసంలో దిగువన రాశాను. గమనించగలరు) పరోక్షంగా టీడీపీ గెలుపును సులువు చేసింది.
*
ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసేందుకు ముందు ఉండటం, పార్టీ క్యాడర్‌ను కనిపెట్టుకుని ఉండటం, తన వారి కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండటం.. లాంటి ఎన్నో లక్షణాలు బొత్స సత్యనారాయణను ఈ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. ముఖ్యంగా బొత్స మేనల్లుడు చిన శ్రీనివాసరావు పార్టీ క్యాడర్ అన్నా.. తన వర్గం అన్న ప్రాణం ఇచ్చే మనిషి. బొత్స కుటుంబ రాజకీయ విషయాలన్నీ శ్రీనివాసరావే చూస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడినుంచైనా సరే.. ఎవరైనా సరే వీరి వద్దకు వచ్చి సాయం కోరితే లేదు.. కాదు.. అనే మాటే ఉండదు. అందుకే ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం వైసీపీకి ఎంతో కీలకం. రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ తిరుగులేని గెలుపును అందుకోబోతోందన్నా.. పార్టీ పూర్తిగా బలోపేతమైందన్నా అందుకు బొత్స కుటుంబం చొరవే కారణం.
*
విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో జిల్లా మొత్తం తాము క్లీన్ స్వీప్ చేయబోతున్నామంటూ బొత్స ప్రకటనలు గుప్పిస్తున్నారు. బొత్స పదే పదే చేస్తున్న ఈ వ్యాఖ్యల్లో వాస్తవం కూడా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చాలా అనుకూలంగా ఉంది. అయితే 9 కి 9 కాదులే గాని కనీసం 7 సీట్లు మాత్రం వైసీపీ గెలవడం పక్కా అని మాత్రం చెప్పాల్సిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఆరు చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సారి ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ కి రెండు చోట్ల మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీపై ఈ జిల్లాలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉంది. రైతులు ఆవేదనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లా ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వ పథకాలేవీ సరిగా పనిచేయడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దోపిడీ ని చూసి జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇవన్నీ టీడీపీకి నష్టాన్ని చేకూర్చే అంశాలే.
*
వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన ఆ మూడు స్థానాల్లో పరిస్థితి
గత ఎన్నికల్లో కురుపాం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. కురుపాం, సాలూరు ఎస్టీ రిజర్వ్‌డు నియోజకవర్గాలు. ఈ రెండు చోట్లా మళ్లీ వైసీపీ విజయం సాధించబోతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, స్వతహాగానే ఈ నియోజకవర్గాల్లో వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు దండిగా ఉండటం, తాజాగా టీడీపీ నుంచి ద్వితీయశ్రేణి నాయకుల చేరికలు, టీడీపీకి ఈ నియోజకవర్గాల్లో ఉన్న పేలవ రికార్డు ఇవన్నీ అక్కడ వైసీపీకి విజయాన్ని ఖాయం చేస్తున్నాయి. ఇక మిగిలింది బొబ్బిలి నియోజకవర్గం ఈ నియోజకవర్గం గురించి సమగ్ర కథనాన్ని తర్వాత రాస్తాను.
*
బొత్స సత్యనారాయణ ప్రభావం మెండుగా ఉండే నియోజకవర్గాల్లో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అద్భుత వ్యూహాన్ని అనుసరిస్తోంది. గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కిమిడి మృణాళిని 20,842 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి పెదబాబు (చంద్రశేఖర్) మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయనకు 42,179 ఓట్లు రాగా.. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఏకంగా 42, 945 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌పార్టీ ఓట్లను పెదబాబు, బొత్స పంచుకోవడంతో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచారే తప్ప.. ఆ పార్టీ బలంగా ఉండటం వల్ల ఏ మాత్రం కాదు. ఈ సారి చంద్రశేఖర్ విజయనగరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. చీపురుపల్లి టికెట్టు బొత్స సత్యనారాయణకే వైసీపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీన్ని బట్టి బొత్స ఆ నియోజకవర్గంలో 20వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. మరో నియోజకవర్గం గజపతినగరంలో బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్య అత్యంత బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసిన ఈయన ఏకంగా రాష్ర్టంలోనే రికార్డు స్థాయిలో మరే ఇతర కాంగ్రెస్ అభ్యర్థి సాధించలేనన్ని ఓట్లు (44,325) దక్కించుకున్నారు. ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కె.శ్రీనివాసరావు (45694) ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి కె.అప్పలనాయుడు 19,423 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో సైతం బొత్స సోదరుడికి ఇక్కడ 30వేల పైచిలుకు మెజారిటీతో విజయం దక్కింది. ఈ సారి తిరిగి అప్పలనరసయ్యకే ఇక్కడ వైసీపీ టికెట్టు ఇవ్వబోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన కె.శ్రీనివాసరావుకు శృంగవరపుకోట టికెట్టు ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించింది. అయితే శృంగవరపు కోటలో బలమైన అభ్యర్థి ఇందుకూరు రఘురాజు బొత్స కు ఆత్మీయుడు కావడంతో ఆయన్ను అక్కడ కె.శ్రీనివాసరావుతో కలిసి పనిచేసేలా చేయించిన బొత్స తన తమ్ముడికి తిరిగి గజపతి నగరం టికెట్టు ఇప్పించుకోవడంలో లైన్ క్లియర్ చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో బొత్స సోదరుడు కనీసం 20 వేల మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లాలోనే కీలకమైన మరో నియోజకవర్గం నెలిమర్లలో రెండు రోజుల కిందటే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తను మార్చింది. బొత్స రాజకీయ గురువైన పెనుమత్స సాంబశివరాజు కుమారుడు పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) స్థానంలో బొత్స మేనల్లుడు అప్పలనాయుడును నియమించింది. అప్పలనాయుడు ఈ నియోజకవర్గంలో బలమైన వ్యక్తి. ఈయనకు సురేష్‌బాబు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆ జిల్లా నాయకులు చెబుతున్నారు. అదే జరిగితే ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోయిన సారీ టీడీపీ (అభ్యర్థి పి.నారాయణస్వామి ) కి వచ్చిన మెజారిటీ కేవలం 6273 ఓట్లు మాత్రమే. కానీ బొత్స బంధువు అప్పలనాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఏకంగా 23,884 ఓట్లు సాధించారు. ఆయన కనుక పోయిన సారి పోటీలో లేకుండా ఉండి ఉంటే వైసీపీ సునాయాసంగా విజయం సాధించి ఉండేది. వచ్చే ఎన్నికల్లో అప్పలనాయుడే పోటీ చేయనుండటంతో వైసీపీ గెలుపు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు.
*
ఇక విజయనగరం అసెంబ్లీ విషయానికి వస్తే.. ఇక్కడ వరుసగా 9 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఓడిపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఓటమి చవిచూసింది. టీడీపీకి భారీ పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున మీసాల గీత విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స సత్యనారాయణ మధ్య ఎప్పటినుంచో శత్రుత్వం నడుస్తోంది. ఇద్దరివి వైరి వర్గాలు. వచ్చే ఎన్నికల్లోనూ విజయనగరం నుంచి వీరభద్రస్వామి పోటీ చేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. వచ్చే ఎన్నికల్లో బొత్స ఆయనకు సాయం చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇదే జరిగితే అక్కడా వైసీపీ విజయం సాధించవచ్చు. కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఆశోక్‌గజపతిరాజు దశాబ్దాలుగా ఇక్కడ తన పట్టు కొనసాగిస్తూ వస్తున్నారు. మీసాల గీత కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి గెలుపొందారు. శృంగవరపుకోట నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కాంగ్రెస్‌పార్టీ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. టీడీపీకి అత్యంత బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. అయితే టీడీపీ ప్రతి గెలుపులోనూ కాంగ్రెస్‌పార్టీ స్వయంకృతాపరాధం కూడా ఉందని అక్కడి రాజకీయ పండితులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కొల్లా లలితకుమారి కేవలం 3 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కించుకోగా కాంగ్రెస్‌పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసిన ఇందుకూరు రఘురాజు ఏకంగా 32వేల ఓట్లు, మూడో స్థానాన్ని సాధించి కాంగ్రెస్ గెలుపును అడ్డుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సైతం బొత్స అండతో శృంగవరపు కోట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరోసారి 30వేలకుపైగా ఓట్లు సాధించి టీడీపీ గెలుపునకు పరోక్ష కారణమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి ఇక్కడ లేదు. వైసీపీ అబ్యర్థి కె.శ్రీనివాసరావుకు బొత్స, రఘురాజు ఇద్దరూ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. అల్లు జోగినాయుడు, నెక్కల నాయుడుబాబు, జగన్నాథం… ఇలా మరో ముగ్గురు ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి సమన్వయకర్తలుగా పనిచేశారు. వీరిలో జగన్నాథం శ్రీనివాసరావుకు సహకరిస్తున్నారు. మరో ఇద్దరు కూడా కలిసి పనిచేస్తే వైసీపీ ఇక్కడ సునాయాసంగా గెలుపొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది పార్వతీపురం నియోజకవర్గం. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించబడిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు 6వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి బొత్స సహకారంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎ.జోగారావు 7వేల ఓట్లు సాధించి వైసీపీ విజయాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన జమ్మన ప్రసన్నకుమార్‌కు కాదని, రానున్న ఎన్నికల్లో వైసీపీ జోగారావుకు టికెట్టు ఇవ్వబోతోంది. ప్రసన్నకుమార్ సహకరిస్తే ఇక్కడ వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే.
*
విజయనగరం పార్లమెంటు సైతం గత ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని బొత్స ఝాన్సి అడ్డకున్నారు. గత ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు లక్షా 6వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి వీఎస్ సీకేకే రంగారావును ఓడించారు. మరో వైపు ఝాన్సి ఏకంగా రికార్డు స్థాయిలో కాంగ్రెస్ తరఫున లక్షా 22వేల ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబానికి చెందిన వ్యక్తే ఎంపీగా పోటీ చేయనుండటంతో ఇక్కడ వైసీపీ గెలవబోతోంది. మొత్తం మీద విజయనగరం జిల్లాలోని విజయనగరం ఎంపీ స్థానంతోపాటు కురుపాం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల.. ఈ ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కచ్చితంగా గెలవబోతోంది. పార్వతిపురం, విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వైసీపీ కచ్చితంగా విజయం సాధించబోతోంది. ఇంకా చాలా లోతైన విషయాలను ప్రస్తావించాల్సి ఉన్నా.. నిడివి ఎక్కువైపోతున్న దృష్ట్యా ఇంతటితో ముగిస్తున్నాను.
దొడ్డా రామకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్