Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప తోలిరోజే బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద దృష్టి సారించారు. ఇంకా మెజారిటీ కోసం ఏమి చేస్తారా అని దేశమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఇవేవీ పట్టని యడ్యూరప్ప రైతు రుణాల మాఫీ మీద దృష్టి సారించారు. బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 56 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యడ్యూరప్ప తొలి ఫైలు మీద సంతకం చేశారు. అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం రైతు వ్యతిరేక నిర్ణయాలే అని భావించిన యడ్యూరప్ప రుణమాఫీ అంశాన్ని మొదటి ఫైలుగా ఎంచుకుని సంతకం చేసేశారు.
శాసనసభలో బలనిరూపణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో యడ్యూరప్ప మినహా మంత్రులుగా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ క్యాబినెట్ తో సంబంధం లేకుండా యడ్యూరప్ప తీసుకున్న తొలి నిర్ణయం సంచలనంగా మారింది. అయితే శాసనసభలో బలనిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారు కానీ కాంగ్రెస్-జేడీఎస్లూ సుప్రీం కోర్టులో కేసు వేసినందుకు ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్న వారి వివరాలు సంతకాలతో సహా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రెండు రోజుల్లో బలం నిరూపించుకుని మంత్రివర్గం విస్తరించుకోవాలని యడ్యూరప్ప భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం ఏర్పాటు తరువాత యడ్యూరప్ప మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ – జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాయి.