Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనిషన్నాక కాస్త ఎమోషన్స్ ఉండకుండా ఉంటాయా? ఆ భావోద్వేగాల మీద ఆధారపడి సినిమాలు మాత్రమే తీయొచ్చు అనుకుంటే పొరపాటే. రాజకీయాలు కూడా చేయొచ్చు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఓ 35 ఏళ్ల కిందట లోక్ సభలో 2 సీట్లు వున్న బీజేపీ నేడు 19 రాష్ట్రాల్లో పాలన చేసే స్థాయికి ఎదగడం వెనుక ఈ భావోద్వేగాలు ఎంతగా పని చేశాయో వేరే చెప్పక్కర్లేదు. అంతెందుకు తాజాగా గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ కి ముడిపెట్టి గెలవలేదు. ఇవన్నీ చూస్తూనే వున్నా జనం పెద్దగా పట్టించుకోవడం లేదనే ధైర్యం బీజేపీ నేతలకు వచ్చినట్టుంది. అందుకే అయోధ్యలో రామజన్మభూమి నినాదం ఎత్తుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన కర్ణాటకలో హనుమ జన్మ భూమి అంశాన్ని రెచ్చగొడుతోంది.
కర్ణాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను ఇటీవలే నిర్వహించింది. కర్ణాటక ప్రజలు తిప్పని యోధుడుగా భావిస్తారు. అందుకే ఆయన జయంతి ఉత్సవాలను నిర్బహించాలని సీఎం సిద్ధరామయ్య నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇది ఓట్ల రాజకీయమని బీజేపీ నేతలు రెచ్చిపోయారు. టిప్పు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన పని లేదని వాదించారు. అంతవరకు ఓకే అనుకోవచ్చు. ఆ పార్టీ కి చెందిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టాడు. టిప్పు జయంతి ఉత్సవాలు చేయడాన్ని తప్పుబట్టిన యోగి దాన్ని రామ భక్త హనుమ పుట్టిన ఈ గడ్డ మీద చేయడం ఏంటని జనాన్ని రెచ్చగొడుతున్నారు. యూపీ లో రామజన్మభూమి ని వాడుకున్నట్టే ఇక్కడ హనుమ జన్మభూమి అంశాన్ని వాడుకోడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. కర్ణాటక ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.