Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో పెట్టిన హామీల అమలుకు ఉద్యమిస్తున్న టీడీపీ ని దెబ్బ కొట్టడానికి మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రయోగిస్తున్న అస్త్రమే ఆపరేషన్ గరుడ. అందులో భాగమే జగన్, పవన్ లని చంద్రబాబు మీదకు రెచ్చగొట్టడం. ఆంధ్రప్రదేశ్ లో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. ఆ చిచ్చు ని ఆర్పడంలో చంద్రబాబు సర్కార్ విఫలం అయ్యిందంటూ ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం వంటివి ఈ ఆపరేషన్ గరుడ టార్గెట్. ఈ పనిలో ఇప్పటికే కమలనాధుల స్క్రిప్ట్ ని తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు జగన్, పవన్. ఇప్పటిదాకా మాటలకే పరిమితం అయిన ఆ ఇద్దరు ఇప్పుడు ఆపరేషన్ గరుడలో రెండో అంకానికి తెర లేపారు. అందులో నేషనల్ మీడియాకి పవన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా అందులో భాగమే.
అయితే ఆపరేషన్ గరుడలో ఈ రెండో అంకాన్ని రక్తి కట్టించడంలో పవన్ ఫెయిల్ అయ్యాడని అంతా ఒప్పుకుంటున్నారు. ఈ విషయం బీజేపీ తో పాటు జనసేనకు కూడా అర్ధం అయ్యింది. అయితే ఈ విషయం జనంలోకి ఇంకా చొచ్చుకుపోకుండా చూసేందుకు ఈసారి జగన్ ని ప్రయోగిస్తోంది బీజేపీ.
ప్రత్యేక హోదా డిమాండ్ ని బలంగా వినిపించడానికి పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైసీపీ అవిశ్వాస అస్త్రం ప్రయోగించాయి. వైసీపీ అవిశ్వాసాన్ని ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకున్న బీజేపీ కి చివరిలో టీడీపీ సీన్ లోకి రావడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అందుకే నాలుగు రోజులుగా లోక్ సభలో తెరాస, అన్నాడీఎంకే సభ్యుల్ని అడ్డం పెట్టుకుని సభని వాయిదా వేస్తూ పోతోంది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారుతోంది. అవిశ్వాసానికి బీజేపీ భయపడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ ఇంకో ప్రక్రియ చేపట్టింది. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం గురించి ఏమీ తేలకుండానే రాష్ట్రంలో రేపు జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు. ఈ ఆందోళనల ద్వారా శాంతిభద్రతల సమస్య రేకెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగం అని ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు భవిష్యత్ లో రాష్ట్రం వేదికగా జరిగే ఆందోళనలు కట్టు తప్పకుండా చూసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ, జనసేన రాజకీయ వ్యూహాలపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.