Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అన్న అంశమే అవుట్ డేటెడ్ వ్యవహారంగా మారిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు వేర్వేరు కారణాలతో ఆ అంశాన్ని పక్కనబెట్టాయి. అలాంటి సమయంలో వైసీపీ అధినేత అనంతపురం యువభేరి సభ ద్వారా ఆ అంశాన్ని దుమ్ము దులపడానికి ట్రై చేస్తున్నాడు. ఓ వైపు బీజేపీ తో ఎన్నికల అవగాహన కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే జగన్ హోదా అంశాన్ని లేపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అంటూ బీజేపీ, టీడీపీ ఊదరగొడుతున్నప్పుడు కేసులు ఇతరత్రా కారణాలతో వైసీపీ గొంతు పెగల్లేదు. ఇక ఎప్పుడైతే పీఎం మోడీ అపాయింట్ మెంట్ దొరికిందో అప్పటినుంచి సీన్ ఇంకా మారిపోయింది. ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ పట్టించుకోవడమే మానేసింది. అలాంటిది హఠాత్తుగా ఇప్పుడు జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తికెత్తుకోవడం చూస్తుంటే రెండు సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీ తో నెయ్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో జగన్ ఈ హోదా అంశాన్ని తిరిగి లేవనెత్తడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా వినిపిస్తే భవిష్యత్ లో ఆ అస్త్రం తనకు దక్కకుండా పోతుందన్న భయం అయినా వుండి ఉండాలి.
కారణాలు ఏవైనా జగన్ ఇప్పుడు అనంతలో యువభేరి నిర్వహించి ప్రత్యేక హోదా డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అధికార టీడీపీ కన్నా కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ కే ఎక్కువ తలనొప్పి కలిగిస్తుంది. మోడీ ప్రాభవంతో ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగానే బలవత్తర రాజకీయ శక్తిగా ఎదగాలి అనుకుంటున్న కమలనాథులకు ఈ పరిణామం ఇబ్బందే. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ స్పీడ్ కి బ్రేకులు పడ్డట్టే. ఇలా బీజేపీ ని ఇబ్బంది పెడుతూనే ఆ పార్టీ ప్రాపకం సంపాదించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ చేస్తున్న ప్రయత్నం కత్తి మీద సాము లాంటిదే.