Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు… కనీసం మేమున్నామని గుర్తించు”… సూపర్ డూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. పవన్, జనసేన పొలిటికల్ వ్యూహం అంటే పెద్దగా ఇష్టం లేని జగన్ కి ఈ డైలాగ్ నచ్చిందో, లేదో కానీ ఇందులో పరమార్ధం బాగా ఆకట్టుకుంది. 2019 ఎన్నికల టార్గెట్ తో చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలి అనుకున్నారు. సర్కార్ వైఫల్యాల మీద తీవ్ర విమర్శలు చేసి, టీడీపీ నాయకులు దానికన్నా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చేలా చేయాలి అనుకున్నారు. ఓ విధంగా చెప్పాలి అనుకుంటే తిట్టి, తిట్టించుకోవడం ద్వారా తన పాదయాత్ర మీద ప్రజల దృష్టి పడేలా చేయాలి అనుకున్నారు.
పాదయాత్ర మొదలైన తొలివారంలో వైసీపీ అధినేత జగన్ వేసిన ఈ ట్రాప్ లో టీడీపీ పడింది. జగన్ వ్యాఖ్యల మీద దేశం నేతలు, మంత్రులు పెద్ద ఎత్తున మాట్లాడ్డం మొదలెట్టారు. దీంతో జగన్ చేసిన మాటల దాడి కన్నా కౌంటర్ దాడి ప్రభావం ఎక్కువగా కనిపించింది. చంద్రబాబు తరపున జరుగుతున్న సర్వేల్లో ఇదే విషయం వెల్లడి అయ్యింది. దీంతో బాబు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేశారు. జగన్ పాదయాత్రను సాధ్యమైనంత వరకు పట్టించుకోనట్టే వుండాలని పార్టీ వాణి వినిపించే ముఖ్యులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో తాను ఎంత తిట్టినా కౌంటర్ గా తిట్టేవారు లేకపోవడంతో జగన్ డీలా పడ్డారు. ఇప్పుడు పాదయాత్ర కి మైలేజ్ తెచ్చే ఇంకో ఆలోచన కావాలని ప్రశాంత్ కిషోర్ కి చెప్పారట. ఆ పీకే సలహా రాకముందే జనసేన తరపున అధినేత పీకే చేసిన పర్యటన చుట్టూ మీడియా మొత్తం తిరగడం చూసి జగన్ కి పుండు మీద కారం చల్లినట్టు అయ్యిందట. ఈ సమయంలో తిట్టు, తిట్టించుకో ప్లాన్ కి ఏదైనా అల్టెర్నేటివ్ కావాలని జగన్ అండ్ కో తెగ అన్వేషిస్తోంది.