Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణమైన మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలన్నింటికన్నా ఇది అన్యాయమైన మోసమని జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా ప్రధానమంత్రిని అడిగితే వచ్చేదని… తన వైఖరితో చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఎండమావిగా మార్చారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిలోని ఉండవల్లిలో నిర్వహించిన ర్యాలీలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఒకే మార్గంలో ఉద్యోగాలు వస్తాయని, అదే ప్రత్యేక హోదా అని, అలాంటిది… ఈ విషయంలోనే చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు.
విభజన సమయంలో చంద్రబాబు సమన్యాయం కావాలని అన్నారని, ప్రత్యేక హోదా అని ఊదరగొట్టారని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాలు మర్చిపోయారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసించడంతో పాటు… ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారని జగన్ చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే… తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి… నిరాహార దీక్షకు కూర్చునేవారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే… ఈ అంశం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారేది కాదా, మోడీ ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదా ప్రకటించేది కాదా… అని జగన్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.