ఇటీవల ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తూ బీజేపీని తిడతారని… మరోపక్క కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారని, ఇదేం రాజకీయమని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి తన కారణంగా నష్టం జరగకూడదని భావించిన పరకాల ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు.
తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. తాను ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పరకాల ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాటంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రతిపక్ష నేతలు చేస్తున్నారని పరకాల మండిపడ్డారు. తన వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు తన కుటుంబంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.