Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రాజకీయ ఎదురు దెబ్బలు తిన్నా వైసీపీ అధినేత జగన్ ఇంకా ఓ బలమైన రాజకీయ శక్తే. దానికి ప్రధాన కారణం ఇప్పటికీ ఆయనలో ప్రజాకర్షణ శక్తి మిగిలి వుంది. ఆ శక్తే జగన్ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తతకి కారణం. అయితే ఇదంతా జగన్ గొప్పదనం అని అనుకుంటే పొరపాటే. ఎన్నో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రబల శక్తిగా వున్న రెడ్లు జగన్ ని సొంతం చేసుకోవడమే. సీనియర్ రెడ్డి నేతలు ఎందరో వున్నా వై.ఎస్ మరణం తర్వాత తమ నాయకుడు జగన్ అని రెడ్లు ఫీల్ కావడానికి ప్రధాన కారణం ఆయనలో పోరాట పటిమ. సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢీకొట్టడం తో వారి దృష్టిలో జగన్ హీరో అయ్యాడు. ఇక అంతకుముందు ఈనాడు సంస్థల అధినేత రామోజీ ని సాక్షి తో జగన్ సవాల్ విసరడం చూసి రెడ్లు పొంగిపోయారు. అలాంటిది ఇప్పుడు పాదయత్రకి ముందు రామోజీ ఆశీస్సులు కోసం జగన్ వెళ్లడం చూసి రెడ్లు రగిలిపోతున్నారట.
చంద్రబాబు కన్నా రామోజీని ఎక్కువగా వ్యతిరేకించే ఓ వైసీపీ నేత అయితే తన మనసులో మాట ఏ మొహమాటం లేకుండా పార్టీ శ్రేణుల దగ్గర చెప్పేస్తున్నారంట. జగన్ చేసిన పనివల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువని సదరు నేత విశ్లేషణ చేస్తున్నాడట. అయినా రాజకీయంలో వున్నప్పుడు యుద్ధం చేసి ఓడిపోయినా గౌరవం ఉంటుంది కానీ ముందే శత్రువుల కాళ్ళ మీద పడితే పరువు పోవడం, శ్రేణుల్లో ఆత్మ స్తైర్యం దెబ్బ తినడం తప్ప ప్రయోజనం లేదని తేల్చేశారట. అందుకు చరిత్ర నుంచి ఓ ఉదాహరణ కూడా వినిపిస్తున్నారట రాయలసీమకి చెందిన ఆ నేత.
భారత దేశం మీద దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ తనతో తీవ్ర పోరాటం చేసిన పోరస్ ని మాత్రమే ఓడిపోయినా గౌరవించాడు. లొంగిపోయిన రాజులెవ్వరికీ అలెగ్జాండర్ దగ్గర ఆ పాటి గౌరవం దక్కలేదు. ఈ విషయం చెప్పి రామోజీ దగ్గరికి వెళ్లడం ద్వారా రెడ్ల ఆత్మగౌరవాన్ని జగన్ తన అధికారం, కేసులు కోసం తాకట్టు పెట్టారని ఆ నేత వాపోయాడట. ఈ నాయకుడు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఏపీ లో దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం చేసిన రెడ్లు నిజంగానే జగన్ చర్య తో రగిలిపోతున్నారు.