Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరసగా ఎదురు దెబ్బలు తింటున్నా వైసీపీ అధినేత జగన్ వైఖరిలో ఇసుమంతైనా మార్పు రావడం లేదు. షాక్ లు తగిలేకొద్దీ ఆత్మశోధన చేసుకోకపోగా ఆక్రోశం పెంచుకుంటున్నారు. ఆవేశపడిపోతున్నారు. చేసిన హామీలు నెరవేర్చలేని సీఎం చంద్రబాబును నడి రోడ్డు మీద కాల్చి చంపినా పాపం లేదని నంద్యాల ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపి దెబ్బ తిన్న తరువాత కూడా జగన్ ధోరణిలో నో చేంజ్. తాజాగా పాదయాత్రలో సైతం ఆయన వాడుతున్న భాష జగన్ లోని ఫ్రస్ట్రేషన్ కి అద్దం పడుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం మీద స్పందిస్తూ గొర్రెలు,పశువుల్లా కాదు పందుల్లా వారిని కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆవేశపడిపోయారు. ఆ ఉక్రోషం లో ఆయన ఒక మాట మర్చిపోతున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఈ వ్యవహారం మొదలైందని జగన్ కి గుర్తున్నట్టు లేదు పాపం. ఇటు టీడీపీ , అటు తెరాస ఎమ్మెల్యేలను వై,ఎస్ హయాంలో లొంగదీసుకోవడంతోనే ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కి బీజం పడింది. ఇక వైసీపీ ఏర్పడ్డాక కూడా అదే పంధా అనుసరించారు. తన దాకా వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు పాపం జగన్ .
ఇక జగన్ బహిరంగసభల్లో వాడిన ఇంకో మాట “బొక్క “. ప్రత్యేక హోదా గురించి మోడీని ప్రశ్నిస్తే బొక్కలో పెడతారని బాబుకు భయం అని చెప్పిన జగన్ అదే కామెంట్ తనకు కూడా వర్తిస్తుందని మర్చిపోయారు పాపం. బాబు ప్రశ్నించకపోయినా కనీసం కేంద్రం మోసం చేస్తోందని బాధపడుతున్నారు. కానీ మిత్రపక్షం కాకపోయినా మోడీ మాట ఎత్తాలంటే జగన్ వణికిపోవడమే కాదు బీజేపీ ముందు జీ హుజూర్ అనడం జనం దృష్టిని దాటిపోలేదు. ఇప్పటి రాజకీయాల్లో విలువలు గురించి అది కూడా జైలుకి వెళ్లొచ్చిన జగన్ దగ్గర నేర్చుకొనే పరిస్థితిలో ఎవరూ లేరు. విలువలు ఎటూ లేవు. కనీసం భాష అయినా బాగుంటే జగన్ కే మంచిది. లేదా ఇంతకంటే ముతక భాష మాట్లాడేవాళ్ళు చాలా మంది చంద్రబాబు క్యాంపు లో వున్నారు. ఒకటని పది అనిపించుకోవడం కంటే కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడ్డం మంచిది కదా.