వైకాపాలో కమెడియన్ కి ఎమ్మెల్యే టికెట్ !

Ys Jagan offers Tadepalligudem MLA ticket to Prudhvi

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలనే ధ్యేయంతో పాదయాత్ర చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధక్యుడు జగన్. అందుకు అనుగుణంగా ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది, ప్రత్యేకంగా కిందటి ఎన్నికల్లో బీజేపీ గెలుపునకి తోడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ని ఏరి కోరి మరీ పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోవడం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నోటి దురుసు వల్ల కొంతమందిపై వ్యతిరేకత ఉండడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది ప్రతిపక్ష పార్టీ. దీంతో ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాసం ఉన్న వారికే సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది.

రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే వారి జాబితాపై ఇప్పటికే కసరత్తు మొదలయిపోయిందని తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లిన వారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మినహా ఇస్తే వైసీపీకి చాలా మంది కొత్త వారు కావాల్సి వచ్చిందట. అందుకు అనుగుణంగా అప్పట్లో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన బృందంతో కలిసి ఏపీలోని నియోజకవర్గాల్లో సర్వే కూడా నిర్వహించాడు. అందులో ఇప్పటికే కొంత మందిపై ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక కొంచెం కష్టం అనుకున్న ఏరియాల్లో వివిధ రంగాలకు చెందిన కాస్త ఫాలోయింగ్ ఉన్న వారిని తీసుకోవాలని భావిస్తోంది వైసీపీ అధినాయకత్వం. అందుకోసమే వారు సినిమా రంగం వైపు దృష్టిని మరల్చారట. ఈ రంగంలో ఉన్న, వైసీపీకి సపోర్టుగా ఉన్న వారిలో కొంత మందిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. వారిలో ప్రముఖ కమెడియన్ లు, పోసాని, పృథ్వీ పేరులు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల పోసాని ఆ తర్వాత హాస్యనటుడు 30 ఇయర్స్ పృథ్వీ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు. పోసాని అయితే తాను రాజకీయాలకి రాను అని ప్రకటించాడు కానీ పృధ్వీ మాత్రం తనది పశ్చిమ గోదావరి జిల్లా అని, జగన్ అంటే తనకు ఇష్టమని, వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం అవుతాడని అన్నారు. పార్టీలో చేరతారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ఖాళీ స్థానాలు లేవని పేర్కొన్న పృథ్వి త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని వెంటనే ఆయనకీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ టికెట్ బీజేపీకి వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి జగన్ పార్టీలోకి పృథ్వి ఎంటర్ అవ్వడం అలా టికెట్ ప్రకటించడం జరిగిపోతాయని వైకాపీయులు భావిస్తున్నారు.