Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు రాజశేఖర్ లాంటి హీరో పక్కన వచ్చి కూర్చుంటేనే పోటీ ఫీల్ అయిపోయిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కుటుంబాల ముందు ప్రాధేయపడే స్థితికి వచ్చాడు. 2019 నాటికి ఆ నాలుగు ఇళ్లలో ఒక్కరైనా రాకపోతారా అన్న ఆశతో జగన్ ఓ రకంగా చెప్పాలంటే దేబిరింతకీ సిద్ధపడ్డాడు. ఇంతకీ జగన్ టార్గెట్ చేసింది మాత్రం ఆషామాషీ కుటుంబాల్ని కాదు. టాలీవుడ్ లో దిగ్గజ కుటుంబాల్ని. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, కొణిదెల ఫ్యామిలీ ల నుంచి ఒక్కరినైనా వైసీపీ తరపున ఎన్నికల బరిలోకి దించడానికి జగన్ ట్రై చేస్తున్నాడు.
టీడీపీ లో తనకి ప్రాధాన్యం లభించడం లేదని వాపోతున్న నందమూరి హరికృష్ణ కి అసెంబ్లీ, లోక్ సభ టికెట్ లేదా రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇలా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధమని పలు దఫాలుగా వైసీపీ నుంచి ఆఫర్స్ వెళ్లాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కి గాలం వేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. తాజాగా కూడా ఇదే ఆఫర్ తో ఇంకోసారి హరికృష్ణ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కానీ హరికృష్ణ గానీ ఈ ప్రతిపాదనలపై పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో ప్రస్తుతానికి వేచి చూడడం తప్ప జగన్ కి ఇంకో దారి లేకపోయింది.
ఇక అక్కినేని నాగార్జున విషయానికి వస్తే జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఇప్పుడు ఆయన్ను ఎలాగైనా కమ్మ సామాజిక వర్గం బలంగా వున్న ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించడానికి జగన్ పావులు కదుపుతున్నారు. ఇందుకు ఒప్పుకోవాలని నాగ్ మీద భారీ స్థాయిలోనే ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటిరెండు రహస్య సమావేశాలు కూడా జరిగినా నాగ్ ని ఒప్పించలేకపోయినట్టు తెలుస్తోంది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ, వై.ఎస్ మధ్య ఎంత స్నేహసంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ కావడంతో ఘట్టమేని కుటుంబం రాజకీయంగా వైసీపీ కి అండగా నిలవలేకపోతోంది. ఇప్పటికీ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. అందుకే తన తండ్రితో స్నేహసంబంధాల్ని కృష్ణకు గుర్తు చేస్తూ ఇటీవల జగన్ తరపున ఓ ముఖ్యుడు సూపర్ స్టార్ ని కలిసిసాడట. కృష్ణ కి లోక్ సభ సీట్ ఆఫర్ చేశారట. ఇంకా ఆయన చెప్పినవారికి రెండు మూడు అసెంబ్లీ టికెట్స్ ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్పిన కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మహేష్ అభిప్రాయం కనుక్కుంటానని అప్పటికి తప్పుకున్నాడట. విషయం తెలిసిన మహేష్ అసలు ఈ రాజకీయాల జోలికి వద్దని తండ్రికి తేల్చి చెప్పాడట.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకి పోటీనే కాదని భావించిన జగన్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడట. ఆయనతో కలిసి కూటమి ఏర్పాటుకి తహతహలాడిపోతున్నాడట. ఇందుకోసం పవన్ కి తన సలహాదారు ప్రశాంత్ కిషోర్ తో ఓ లేఖ కూడా రాయించాడట. ప్రశాంత్ కి అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో ఓ మెట్టు దిగిన జగన్ పవన్ ఒప్పుకుంటే తానే వచ్చి కలుస్తా అని కూడా కబురు పంపినా జనసేన నుంచి రిప్లై లేదట. ఇలా జగన్ దేహి అంటున్నా ఆ స్టార్ కుటుంబాలు కరుణ దొరకడం లేదు.
మరిన్ని వార్తలు