టీఆర్ఎస్-వైసీపీ గడియారాల బంధం వెనుక అసలు కధ ఇదే…!

What Does KCR Praise For YSR Indicate

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎందుకు అన్నారో కానీ అప్పటి నుండి ప్రతిదీ ఆ రిటర్న్ గిఫ్ట్ అన్నట్టే వార్తలు వస్తున్నాయి. తాజాగా వైసేపీ పంచిన గడియారాల వెనుక టీఆర్ఎస్ బొమ్మలు కనపడడంతో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ఎట్టి పరిస్థితుల్లోనైనా సిఎం కుర్చీ ఎక్కాలనే ఏకైక ఉద్దేశ్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత జగన్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించాడు. 2019 ఎన్నికల అభ్యర్థుల ఎంపికను కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పటికే కొంత మంది నేతలకు టికెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. వారిలో చాలా మందిని ఫస్ట్ లిస్ట్‌లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులుగా చెప్పుకుని పలువురు నేతలు ప్రచారాన్ని ప్రారంభించేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ కొద్దిరోజులుగా గడియారాలను పంచుతున్నారు. గడియారాల కవర్‌పై జగన్‌తోపాటు మాజీ ఎంపీ మిధున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఫోటోలు ఉన్నాయి.

ఇలా వాటిని చూసిన కొందరు స్థానికులు ఈ నేతల ఫొటో కింద మరో ఫొటో ఉందని గ్రహించారు. దీంతో పైన ఉన్న స్టిక్కర్‌ను తొలగించి చూడగా, లోపల మరో స్టిక్కర్ ఉంది. దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణా నేతల ఫొటోలు కనిపించాయి. దీంతో ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. అసలు ఈ గడియారాలను వైసీపీ నేతలకు ఎవరు ఇచ్చారనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తాయి.దీని పై గడియారాలు పంచిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వివరణ ఇచ్చారు. తాము అహ్మదాబాద్ కు చెందిన ఓ కంపెనీకి 60 వేల గడియారాలను ఆర్డర్ ఇచ్చామని చెప్పిన ఆయన, అంతకుముందే టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎమ్మల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా అదే కంపెనీకి ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వారిచ్చిన ఆర్డర్ లో మిగిలిన గడియారాలపై తమ చిత్రాలను అంటించారని, కేవలం 165 గడియారాల్లో మాత్రమే ఈ తప్పిదం జరిగిందని తిప్పారెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీని అప్రమత్తం చేశామని, మిగతా గడియారాలన్నీ సక్రమంగానే వచ్చాయని అన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు.