Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల ముందు వైసీపీ లో టికెట్ గారంటీ అడిగినందుకు రాజకీయాల్లో యోధానుయోధులు అనుకున్న ఎందరినో పక్కనబెట్టారు వైసీపీ అధినేత జగన్. 2019 ఇంకో ఏడాదిన్నర కాలంలో ఉండగా పార్టీనే అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతోంది. ఇలాంటి పరిస్థితి నెలకొన్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఒకప్పుడు వైసీపీ వైపు చేసారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వైసీపీ కి అభ్యర్థి లేకుండా పోయారు.
గన్నవరంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఇప్పటిదాకా దుట్టా రామచంద్రరావు వున్నారు. వై. ఎస్ సన్నిహితుల్లో ఒకరిగా పేరుపడ్డ దుట్టా ఆది నుంచి వైసీపీ లో వున్నారు. ఆ పార్టీ వైద్య విభాగంలో కీలక బాధ్యతలతో పాటు గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా 2014 లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఈ మధ్య దాకా కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వున్నారు. అయితే హఠాత్తుగా ఈ మధ్య పార్టీ వైద్య విభాగం నుంచి తప్పుకున్నారు. తాజాగా గన్నవరంలో కూడా తనకి పోటీ చేసే ఉద్దేశం లేదని, ఇంకో అభ్యర్థి ని చూసుకోవాలని జగన్ కి చెప్పారట.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దుట్టా చెబుతున్నప్పటికీ 2019 లో గెలుపు మీద నమ్మకం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. అయితే దుట్టా పార్టీ మీద ఎలాంటి ప్రతికూల ప్రకటనలు చేయలేదు. పైగా పార్టీ ఎవరిని అభ్యర్థిగా తీసుకొచ్చినా వారికి సహకరిస్తానని చెప్పారు. ఇంతకుముందు ప్రకాశం జిల్లా దర్శిలో కూడా బూచేపల్లి ఇలాగే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ కోవలో ఇప్పుడు దుట్టా కూడా వెనక్కి మళ్లడం వైసీపీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక అనుకోకుండా డెలిమిటేషన్ కూడా జరిగితే 225 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కూడా వైసీపీ కి కత్తి మీద సామే అవుతుంది.