ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫామ్ కోల్పోవడంతో రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువీ తన క్రికెట్ కెరీర్ ముగిస్తున్నట్లు సోమవారం ముంబయిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రకటించాడు. యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రంగ ప్రవేశం చేశాడు. చివరగా 2017లో వెస్టిండీస్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోండగా ఆ చారానికి తెరదించుతూ తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు యువరాజ్ ప్రకటించాడు. యువరాజ్ తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 14 వన్డేలు, 52 హాఫ్ సెంచరీలతో 8,701 పరుగులు, టీ20ల్లో 8 అర్ధసెంచరీలతో 1177 పరుగులు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో అటు బ్యాట్, ఇటు బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. అనంతరం కేన్సర్ మహమ్మారి బారిన పడిన యువీ మళ్లీ బ్యాట్ పట్టినా గతంలో మాదిరిగా రాణించలేకపోయాడు.