Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ పై తల్లి ప్రభావం ఎంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియాకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో యువరాజ్ తల్లి షబ్నం గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తుంటాడు ప్రతి కీలక మ్యాచ్ కు ముందు యువీ తల్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. భారత్ 2011లో ప్రపంచకప్ సాధించిన తర్వాత యువీ మొదట మాట్లాడింది తల్లితోనే. సాధించేశాం అమ్మా అని కొడుకు తనతో చెప్పినట్టు… తర్వాత ఓ సందర్భంలో షబ్నం మీడియాకు తెలిపింది. క్రికెట్ అనే కాదు… తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయాల్లోనూ యువీ తల్లి మాటలకు ఎంతో విలువ ఇస్తాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువీ తల్లి గురించి చెప్పిన ఓ సంగతి చూస్తే ఈ రోజుల్లో … ఇలాంటి కొడుకులు ఉన్నారా అన్న ఆశ్చర్యం కలగకమానదు.
భారత క్రికెట్లో కీలక ఆటగాడుగా ఉన్న సమయంలో యువీ ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించాడు. వాటిలో యువరాజ్ బైక్ నడుపుతున్న ప్రకటన ఒక్కటీ లేదు. మాజీ కెప్టెన్ ధోనీ ఎన్నో బైక్ ప్రకటనల్లో నటించాడు కానీ యువరాజ్ ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. యాడ్స్ లోనే కాదు… నిజజీవితంలోనూ యువీ బైక్ నడపడు. దీనికి కారణం యువీ తల్లికిచ్చిన మాటే. ఈ విషయాన్ని స్వయంగా యువరాజే వెల్లడించాడు. ప్రస్తుతం తాను బైక్ లు నడపలేనని, తల్లి షబ్నం తనతో ఒట్టు వేయించుకోవడమే ఇందుకు కారణమని యువీ తెలిపాడు. తాను బైక్ నడిపిన రోజున తన తల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని హెచ్చరించిందని, ఆమె ఇంట్లో ఉండాలంటే తాను బైక్ నడపకూడదని యువీ వెల్లడించాడు.
దూకుడుగా ఉండే యువీ… బైక్ నడపడం ప్రమాదకరమని భావించే తల్లి ఆయనతో ఒట్టు వేయించుకుందేమో. అయితే బైక్ నడపాలన్న తన ఇష్టాన్ని… కార్ డ్రైవింగ్ చేయడం ద్వారా తీర్చుకుంటున్నాడు యువీ. కార్లు నడపడమంటే తనకు చాలా ఇష్టమని, తన దగ్గర మెర్సిడెజ్, బెంజ్, ఆడి, బీఎమ్ డబ్ల్యూ కార్లు ఉన్నాయని యువీ చెప్పాడు. ఇంగ్లండ్ పై ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు రెండు కార్లు తనకు కానుకగా అందాయని తెలిపాడు. తన ఫేవరెట్ కారు మెర్సిడెజ్ అని, ప్రస్తుతం తన మెర్సిడెజ్ కారును తన తల్లి వాడుతున్నారని యువీ చెప్పాడు.
మొత్తానికి యువీ మరోసారి తనపై తల్లి ప్రభావం ఎంతో వివరించాడు. తల్లి కోసం బైక్ రైడింగ్ మానేసిన యువీ… తనకు ఇష్టమైన మెర్సిడెస్ కారును కూడా తల్లికి ఇచ్చి… ఆమెపై ఉన్న ప్రేమను తెలియజేశాడు. అయితే యువీ ఇంతగా అభిమానించే తల్లి ఇటీవల గృహహింస కేసును ఎదుర్కొంది. యువరాజ్ సింగ్ సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ… భర్తపైన, అత్తపైనా, యువరాజ్ సింగ్ పైనా… గృహహింస కేసు పెట్టారు. ఈ కేసులో ఇటీవలే వారికి సమన్లు అందాయి. భర్త, అత్త తనను మగబిడ్డ కనాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, కుటుంబ సభ్యుల మాటలకు యువరాజ్ మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించింది.