చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికించేస్తోన్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విద్యాలయం కూడా ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ పై తీవ్రమైన పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనక అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ విజయవంతమైతే 30 మిలియన్ డోస్ లను ఉత్పత్తి చేయాలి. అందుకోసం ప్రభుత్వం 47 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తోంది.
అయితే ఈ పరిశోధనలో భాగంగా విశ్వ విద్యాలయం తయారు చేసిన సిహెచ్ఏడి ఓఎక్స్1ఎన్ కోవిడ్ 19 అనే వ్యాక్సిన్ ను ఈ మధ్య కోతులపై ప్రయోగించారు. కానీ కోతుల్లో ప్రయోగించిన ఈ మెడిసిన్ విఫలం అయ్యింది. కోతుల్లో కేవలం ఈ వ్యాక్సిన్ న్యుమోనియాను మాత్రమే ఆపగలిగింది. వ్యాక్సిన్ ఇచ్చిన కోతులకు, వ్యాక్సిన్ ఇవ్వని కోతుల్లోని కరోనా వైరస్ ఆర్ఎన్ఏను పరిశీలించగా ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇంకా లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ వ్యాక్సిన్ ను మనుషులపై కూడా ప్రయోగించ బోతున్నారు.
ఒకవేళ మనుషుల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తే ఈ వ్యాక్సిన్ కేవలం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని సమాచారం అందుతుంది. అయితే పూర్తిస్థాయిలో కరోనా వైరస్ ను అంతం చేయడానికి వ్యాక్సిన్ రావాలి అంటే ఎన్నేళ్లు పడుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. అసలు కరోనాకు వ్యాక్సిన్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు కూడా బీభత్సంగా వస్తున్నాయి.